1945 Movie Review : స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకుల మీద పోరాట సినిమాల లిస్టులో ‘1945’ కూడా చేరింది గానీ, ఈ సినిమా అంటే మొదట్నుంచీ హీరో రానా దగ్గుబాటికి ఇష్టం లేదు కాబట్టి, నిర్మాతతో పడక అయిదేళ్ళూ అస్తవ్యస్తంగా నిర్మాణం చేసి హడావిడిగా విడుదల చేశారు కాబట్టీ, దీన్నొక సినిమాగా పరిగణించక లిస్టులోంచి కొట్టేయవచ్చు. రానా కనీసం డబ్బింగ్ కూడా చెయ్యక మూగనోము పడితే సినిమాకే గతి పడుతుందో వూహించవచ్చు. క్లయిమాక్స్ ని కూడా బహిష్కరిస్తే ఇదేం సినిమా అని ముక్కు మీద వేలేసుకోవచ్చు. సినిమాకి ముగింపు లేదు. అంటే రెండో భాగం తీస్తారని కాదు. తీసిన భాగమే పూర్తి చేయలేక! ఇంత కంటే జోకు ఈ జనవరి మాసంలో 2022 పూర్తయ్యే వరకూ లేదు. ఈ యేటి మేటి జోకు ఇది.
1942- ఏ లవ్ స్టోరీ.. కాదు కాదు, ‘1942- ఏ లవ్ స్టోరీ’ – హిందీలో తీసిన బ్రిటిష్ తో పోరాట పీరియెడ్ మూవీలోని ప్రేమ కథని దోచుకుని, ‘1945 – ఏ లవ్ స్టోరీ’ గా దోపిడీ దార్లయిన తెల్లదొరల మీద పోరాటానికి సిద్ధం చేశారు. దోచుకున్న కథతో దోపిడీ దార్లమీద పోరాటం. పాత సినిమాల్లో జమీందారుతో పోరాటం టైపు లాంటి పాత సీన్లతో దేశభక్తి కథ. ఈ కథ 1945లో బర్మా (నేటి మయన్మార్) లో జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ తో పోరాడటానికి ఇండియన్ నేషనల్ ఆర్మీని ప్రారంభించే సమయంలో ఆది (రానా దగ్గుబాటి) తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి బర్మాకి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత బ్రిటిష్ తాసిల్దారు కుమార్తెని ప్రేమించి (రెజీనా)తో నిశ్చితార్థం చేసుకుంటాడు. ఇక పెరుగుతున్న తెల్లదొరల దురాగతాలు చూసి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకుతాడు. ఇక ఈ పోరాటంలో ఎలా గెలుపు సాధించాడన్నది మిగతా కథ.
ఇందులో ప్రేమ కథ సరిగా లేదు, పోరాట కథా సరిగా లేదు. ఏ కథకీ సరైన భావోద్వేగాల్లేవు. కొన్ని చోట్ల అసలు అర్ధమే వుండదు. రానా సంఘర్షించడానికి కారణమూ హాస్యాస్పదమే. ఇక దేశభక్తి ఎక్కడా ఉప్పొంగే సమస్యే లేదు. సినిమా ముగింపు మాత్రమే కాదు, కొన్ని సీన్లు కూడా ముగియకుండానే కట్ అయిపోతూంటాయి. అరాచకంగా వుంటుంది సినిమా ప్రదర్శన. రానా, సప్తగిరిల కామెడీ కూడా బ్రిటిష్ వాళ్ళకంటే అరాచకంగా వుంటుంది. రానా- రెజీనాల ప్రేమ బందరు కాల్వలా వుంటుంది. దేశ ద్రోహుల పన్నాగాలు, పోలీసుల దౌర్జన్యాలు, వడ్డీ వసూళ్ళు, నడ్డి విరిచే పన్నుల వసూళ్ళూ – వీటి మీద తిరుగుబాటూ- ఏ స్వాతంత్ర్య పోరాట సినిమా చూసినా ఇవే కథలు. బ్రిటీషర్లు ట్రిగ్గర్-హ్యాపీ విలన్లు. మాస్ మసాలా సినిమాల్లో లో – గ్రేడ్ విలన్ల లాగా నవ్వడాలు, మాట్లాడితే కాల్చి చంపడాలు, ఇంతే.
1945 నాటి వాతావరణ సృష్టి వరకూ కళా దర్శకత్వం బావుంది. ఇది మినహా మరేదీ బావున్న దాఖలాల్లేవు. రీరికార్డింగ్, గ్రాఫిక్స్ కూడా అశ్రద్ధకి లోనయ్యాయి. యువన్ శంకర్ రాజా సంగీతం ఇప్పుడు ఔట్ డేటెడ్ అయింది. సత్య పొన్మార్ ఛాయాగ్రహణం కొంత వరకూ ఫర్వాలేదు. తెలుగు, తమిళ భాషల్లో తీసిన తమిళ దర్శకుడు సత్యశివ ఎందుకు ఈ టెంప్లెట్ స్వాతంత్ర్య కథని తలపెట్టాడో అర్ధంగాదు. కొత్తగా ఏం చెప్పాడు? అసలు స్వాతంత్ర్య పోరాటమన్నా, పోరాట యోధులన్నా, వాళ్ళు లాఠీ దెబ్బలు తిని జైల్లో మగ్గిన చరిత్ర, అన్నా, దేశభక్తి అన్నా తెలియకుండా కాలం గడిపేస్తున్న, ఉచితంగా స్వాతంత్ర్యం అనుభవించేస్తున్న యువతరం అధిక శాతం వుంది. కంగనా రణవత్ ల వంటి కుహనా దేశభక్తుల మాటలు వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. స్వాతంత్ర్య పోరాటం వాళ్ళకి సుదూర చరిత్ర. దాన్ని వాళ్ళ సమీపంలోకి తేవాలంటే యూత్ అప్పీల్ తో నూనూగు మీసాల యువపాత్రలతో, స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధుల కథల్ని తెరపైకి తేవాలే తప్ప, ఇంకా ముసలి వాళ్ళతో అరిగిపోయిన ముసలి పన్ను వసూళ్ల కథలు కాదు. ఇవి కనెక్ట్ కావు. ఇంకా చూసేవాళ్ళూ లేరు.
—సికిందర్