పవన్ ముందు మింగలేక కక్కలేక నిర్మాతల తంటాలు…

Producers waiting for Pawan Kalyan's word
Producers waiting for Pawan Kalyan's word
పవన్ కళ్యాణ్.. మూడ్ బాగుంటే అయనంత కంఫర్టబుల్ హీరో మరొకరు ఉండరు. అదే మూడ్ స్వింగ్ అయితే నిర్మాతలు, దర్శకులు తలలు పట్టుకోవాల్సిందే. అందుకే ఆయనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు ఓపిక కొద్దిగా ఎక్కువ ఉండాలి అంటుంటారు. రీఎంట్రీ ఇచ్చాక పవన్ శైలి మార్చారు.  ధారాళంగా డేట్స్ ఇచ్చేశారు. రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ వచ్చారు.  ఏడాదిలో రెండు సినిమాలు కంప్లీట్ చేసే స్పీడ్ అది.  అంతా బాగానే ఉంది అనుకునే టైంకి ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో కొత్త క్రమశిక్షణ బీటలు వారింది. పవన్ ఒకటిన్నర నెలగా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు బయటికి వస్తారో తెలియదు. 
 
దీంతో సెట్స్ మీద ఉన్న ఆయన సినిమాల నిర్మాతలకు కంగారు మొదలైంది. ప్రస్తుతం పవన్ రెండు సినిమాలు చేస్తున్నారు.  మలయాళం రీమేక్ ఒకటి, హరి హర వీరమల్లు రెండవది. సినిమాలు రెండూ సగంలో ఉన్నాయి. గట్టిగా ఇంకో మూడు నెలలు వర్క్ చేస్తే రెండూ కంప్లీట్ అవుతాయి. కానీ సెల్ఫ్ ఐసోలేషన్ నుండి పవన్ ఎప్పుడు బయటికి వస్తారో స్పష్టత లేదు. జూన్ మధ్యలోకి షూటింగ్ రీస్టార్ట్ చేయాలని నిర్మాతల ఆలోచన. వేరే హీరో అయితే నిర్మాతలు పట్టుబట్టి షూటింగ్ పలానా టైమ్ కి మొదలుపెడతాం రావాలి అనేవారేమో కానీ అక్కడున్నది పవన్. ఆయన చెప్పిందే వినాలి తప్ప రూల్స్ పాస్ చేయడం కుదరదు. అదే నిర్మాతలకి వచ్చిన ఇబ్బంది.  తాము ఎలాగూ గట్టిగా అడగలేరు కాబట్టి పవన్ కళ్యాణే పూనుకుని త్వరగా ఒక డేట్ చెబితే షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటాం కదా అనుకుంటున్నారు.