సినీ నటుడు ప్రకాష్ రాజ్, ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న విషయం విదితమే. ఆయన నేతృత్వంలోని ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్‌ని ఢీకొంటోంది. ఇంకా పోలింగ్ జరగకుండానే ప్రకాష్ రాజ్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య పోటీ గట్టిగా నడిచింది.
అయితే, మోహన్ బాబు నేరుగా రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. నేరుగా.. అంటే మోహన్ బాబు, మీడియాలో కనిపిస్తున్నారు, ‘మా’ ఎన్నికలపై మాట్లాడుతున్నారు. అది ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కి కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రకాష్ రాజ్ వైపు చిరంజీవి వున్నారనే ప్రచారం జరుగుతున్నా, చిరంజీవిగానీ.. చిరంజీవి తరఫునగానీ.. ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం.
ఇలా వుంటే, పోస్టల్ బ్యాలెట్ పేరుతో కుట్ర జరుగుతోందని ఆరోపించిన ప్రకాష్ రాజ్, స్వరాన్ని బాగా తగ్గించేశారు. ఒకింత ఆవేదన ఆయన మాటల్లో కనిపిస్తున్నా.. అదే సమయంలో, చేతులెత్తేసిన వైనం కూడా కనిపించింది. పరిశ్రమ పెద్దలెవరూ మాట్లాడరా.? చిరంజీవి, కృష్నంరాజు, మురళీమోహన్, నాగార్జున.. అందరూ మాట్లాడాలంటూ కంటతడి పెట్టినంత పని చేశారు ప్రకాష్ రాజ్.
కాగా, కోవిడ్ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌కి అనుమతిచ్చామన్ని ఎన్నికల అధికారుల వాదన. మొత్తం 125 మంది సభ్యులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే, సుమారు 60 మంది ఓట్లను అప్పుడే విష్ణు ప్యానెల్ లాగేసిందని ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తోంది. ‘ఇలాగైతే ఎన్నికల్లో పోటీ చేయడమెందుకు.?’ అన్న ప్రశ్న శ్రీకాంత్, జీవిత సహా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి దూసుకొస్తోంది.