ఏపీ శాసన రాజధాని విజయవాడ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలస్ లో ఆదివారం చోటు చేసుకున్న ఘటన రాష్ర్ట వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా 10 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉన్న కొవిడ్ సెంటర్ గా ఉన్నట్లు తేలింది. అయితే ఈ ఘటనపై ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఘటనకు-ప్రభుత్వానికి ఎంత మాత్రం సంబంధం లేదంటున్నారు. కేవలం రమేష్ ఆసుపత్రిలో వైద్యానికి మాత్రమే అనుమతిచ్చామని..ఎలాంటి కొవిడ్ సెంటర్ కి అనుమతి వ్వలేదని అంటున్నారు. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని మంత్రి నిప్పులు చెరిగారు. బాధ్యులెవర్నీ విడిచి పెట్టబోమని గట్టిగా హెచ్చరించారు. అయితే రమేష్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం దీనిపై ఇంత వరకూ సరైన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అసలు షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది? ప్రభుత్వం అనుమతులిచ్చిందా? లేక రమేష్ ఆసుపత్రి అద్దెకు ఆ బిల్డింగ్ ని తీసుకుని చికిత్స అందిస్తుందా? అన్న దానిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. మహమ్మారిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ర్టంలో ఖాళీగా ఉన్న కొన్ని బిల్డింగ్ లను ప్రభుత్వం అద్దెకు తీసుకుని కొవిడ్ సెంటర్లగా మార్చి రోగులకు అవసరమైన చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.
వైరస్ వచ్చిన కొత్తలో క్వారంటైన్ సెంటర్లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అందులో కొన్ని కొవిడ్ సెంటర్లుగా మారాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. రోజూ కేసులు ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రుల్లో బెడ్లు కోరత ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయివేట్ బిల్డింగ్ లను ప్రభుత్వ అనుమతులతో ప్రయివేట్ యాజమాన్యాలు అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాయి. మరి రమేష్ ఆసుపత్రి ఎలాంటి అనుమతులు పొందకుండా కొవిడ్ సెంటర్ గా మార్చారు? అని మంత్రి ఆరోపిస్తున్నారు. దీని వెనుక మతలబు ఏంటో. అయితే జగన్ అనుమతి ఇస్తే ఆరోపణల్ని ఎదుర్కోంటున్న వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.