భారతీయ సంప్రదాయంలో పితృపక్షానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన కాలం ఇది. ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు పితృపక్షం కొనసాగుతుంది. ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 7న రాత్రి 1.41 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఈ కాలంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి ఆశీస్సులు మన కుటుంబంపై ఉండాలని కోరుతూ తర్పణాలు, శ్రద్ధకర్మలు, పిండప్రధానాలు, దానధర్మాలు విస్తృతంగా నిర్వహిస్తారు.
పితృపక్షం రోజువారీ తిథులు ఎంతో ప్రాధాన్యమున్నవే. ఈ 15 రోజుల్లో ప్రతిరోజూ వేర్వేరు తిథులలో శ్రద్ధకర్మలు చేస్తూ పూర్వీకులను స్మరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి రోజు మహాలయ అమావాస్యను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజున చాలామంది పెద్దలకు తర్పణం విడిచి, సాంబ్రాణి వేసి పూర్వీకులకు నివాళులర్పిస్తారు.
పితృపక్షంలో ముఖ్యమైన రోజులు: సెప్టెంబర్ 7న (పౌర్ణమి తిథి), సెప్టెంబర్ 8న (ప్రతిపాద తిథి), సెప్టెంబర్ 9న (ద్వితీయ తిథి), సెప్టెంబర్ 10న (తృతీయ చతుర్థి), సెప్టెంబర్ 11న (పంచమి శ్రద్ధ), సెప్టెంబర్ 12న (షష్టి శ్రద్ధ), సెప్టెంబర్ 13న (సప్తమి శ్రద్ధ), సెప్టెంబర్ 14న (అష్టమి తిథి), సెప్టెంబర్ 15న (నవమి తిథి), సెప్టెంబర్ 16న (దశమి తిథి), సెప్టెంబర్ 17న (ఏకాదశి తిథి), సెప్టెంబర్ 18న (ద్వాదశ తిథి), సెప్టెంబర్ 19న (త్రయోదశి తిథి), సెప్టెంబర్ 20న (చతుర్దశి తిథి), సెప్టెంబర్ 21న (మహాలయ అమావాస్య).
ఈ కాలంలో కాకులకు పిండ ప్రధానం చేయడం, దానాలు ఇవ్వడం వెనుక లోతైన విశ్వాసం ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కాకి యమధర్మరాజు దూతగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మలు భూమి మీదకు వచ్చి కాకి రూపంలో ఆహారం స్వీకరిస్తాయని నమ్మకం ఉంది. అందువల్ల కాకి ఆహారం తింటే పితృదేవతలు సంతోషిస్తారని, వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ కారణంగానే పితృపక్షంలో కాకులకు ఆహారం పెట్టడం తప్పనిసరి అని భావిస్తారు.
అలాగే పితృపక్షంలో దానం చేయడానికీ అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎవరి శక్తి మేరకు వారు బ్రాహ్మణులకు, పేదవారికి ఆహారం, వస్త్రాలు, ధనాన్ని దానం చేస్తే పుణ్యం కలుగుతుందని చెబుతారు. ఈ కాలంలో చాలామంది సాత్వికాహారం మాత్రమే తీసుకుంటూ భక్తిశ్రద్ధలతో పితృదేవతలకు శ్రద్ధకర్మలు నిర్వహిస్తారు.
పండితులు చెబుతున్నట్లు, పితృపక్షంలో పూర్వీకుల ఆత్మలకు తర్పణాలు చేయడం వలన వంశంలో ఉన్నవారికి అడ్డంకులు తొలగి సౌఖ్యం, సంపద, ఆరోగ్యం లభిస్తాయి. ఈ పవిత్రమైన కాలాన్ని సక్రమంగా ఆచరించే కుటుంబాల్లో శాంతి నెలకొంటుందని, పితృదేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారిని కాపాడుతుందని నమ్మకం.
