ఏపీ పోలీసుల ఓవరాక్షన్.. మాస్కు లేదని చచ్చేలా కొడతారా..?

ఏపీ పోలీసుల ఓవరాక్షన్.. మాస్కు లేదని చచ్చేలా కొడతారా..?
ఈమధ్య ఆంధ్రా పోలీసుల్లో దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.  ఈ దూకుడు డ్యూటీ అక్రమార్కులను పట్టుకోవడంలో, అన్యాయాలను అరికట్టడంలో ప్రదర్శిస్తే పర్వాలేదు.  కానీ సామాన్యుల విషయంలో ఓవరాక్షన్ ప్రదర్శించేలా ఉంది.  కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదని డాక్టర్ సుధాకర్ ఆరోపిస్తే ఆయన్ను నడిరోడ్డు మీద రెండు రెక్కలు విరిచి అరెస్ట్ చేసి పిచ్చాసుపత్రికి పంపారు.  కొన్ని రోజుల వరకు నడిచిన ఆ హైడ్రామా కోర్టు జోక్యంతో సద్దుమణిగింది.  ఇక తూర్పు గోదావరి జిల్లా సీతారాం నగరంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీలను ఆపారని ఒక దళిత యువకుడి పట్ల పోలీసులు అవమానకర రీతిలో ప్రవర్తించారు. 
 
ఆ యువకుడిని స్టేషన్ కు తీసుకెళ్ళి చితకబాదడమే కాకుండా శిరోముండనం చేశారు.  దీంతో విపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో చివరకు సీఎం కలుగజేసుకుని ఒక డీజీపీ, ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.  ఇక తాజాగా మరొక దారుణం చోటు చేసుకుంది.  పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఏకంగా ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది.  మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ముఖానికి మాస్క్ కట్టుకోలేదనే కారణంతో కిరణ్ కుమార్ అనే దళిత యువకుడిని చీరాల ఎస్సై చితకబాదాడు.  దీంతో కిరణ్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు.  దీంతో అతన్ని జీజీహెచ్ నందు జాయిన్ చేశారు.  
 
కానీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో అతన్ని ప్రైవేట్ అసుపత్రిలో జాయిన్ చేశారు.  చివరికి కిరణ్ మరణించాడు.  పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే కిరణ్ మరణించాడని అతని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోకపోవడం తప్పే.  ఆ తప్పుకు జరిమానా వేయడమో, కౌన్సిలింగ్ ఇవ్వడమో చేయాలి కానీ కొట్టడం అనేది అమానుషం.  నెటిజన్లు సైతం రూల్స్ సామాన్యులకేనా.. ప్రభుత్వ పెద్దలు కూడా మాస్క్ లేకుండా తిరిగుతున్నారు.  వారి మీద కేసులు ఉండవా అంటున్నారు.  ఏది ఏమైనా పోలీసులు ప్రజల పట్ల కాస్త సంయమనంతో వ్యవహరిస్తే మంచిది.