కేంద్ర మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అంత సీన్ వుందా.?

Pawan To Get Central Ministry Post From BJP

Pawan To Get Central Ministry Post From BJP

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అరడజను సీట్లలో పోటీ చేసే అవకాశమూ దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ. బీజేపీ కంటే ఓట్ల శాతం పరంగా మెరుగ్గానే వున్నా, తిరుపతి ఎంపీ టిక్కెట్టుని మిత్రపక్షం బీజేపీ నుంచి తెచ్చుకోలేకపోయింది జనసేన పార్టీ. అలాంటిది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారా.? అయ్యేంత సీన్ వుందా.? త్వరలో కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ.. అంటూ చర్చ జరుగుతున్న వేళ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు.. కేంద్ర మంత్రి పదవి రేసులోకి దూసుకొచ్చిందట. ఇదెక్కడి విడ్డూరం.. అని అంతా ముక్కున వేలేసుకున్నారు.

నిజానికి, పవన్ కళ్యాణ్ గనుక కేంద్ర మంత్రి అవ్వాలనుకుంటే, 2014లోనే అయి వుండేవారు. అప్పట్లో జనసేన పార్టీ టీడీపీ – బీజేపీలకు మద్దతిచ్చింది. రాజ్యసభకు వెళ్ళమని టీడీపీ కోరింది.. బీజేపీ కూడా అడిగింది.. కానీ, పవన్ ఆ ప్రతిపాదనల్ని తిరస్కరించారు. అప్పుడు తిరస్కరించిన పవన్, ఇప్పుడు కోరుకున్నా ఆ పదవులు దక్కించుకోవడం అంత తేలిక కాదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ, మెగాస్టార్ చిరంజీవి వైపు మొగ్గు చూపుతోందట కేంద్ర మంత్రి పదవి విషయమై.

చిరంజీవి గనుక బీజేపీలోకి వచ్చినా, జనసేన ద్వారా బీజేపీకి మద్దతిచ్చినా చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం సిద్ధంగానే వుందని సమాచారం. పవన్ కళ్యాణ్ విషయంలో ఆ ఛాన్స్ లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై ఆసక్తి చూపడంలేదట. పవన్, అసెంబ్లీకి వెళ్ళాలనే పట్టుదలతోనే వున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే పవన్ కసరత్తులు ప్రారంభించారట. ఈసారి కూడా పవన్ భీమవరం నుంచి అలాగే గాజువాక నుంచీ పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.