తిరుపతి ఉప ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను తమ అభ్యర్థిగా బరిలోకి దించిన విషయం విదితమే. ‘జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి’ అని బీజేపీ చెబుతున్నా, జనసేన నుంచి ఆమెకు పెద్దగా మద్దతు లభిస్తున్నట్లు కనిపించడంలేదు. నిజానికి, ఇంకా ఆమె ప్రచార బరిలోకి దిగలేదు. నిన్ననే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆమె సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ ముఖ్య నేతలూ పాల్గన్నారు.
పవన్ నుంచి తనకు పూర్తి మద్దతు ప్రచారం పరంగా లభిస్తుందని రత్నప్రభ విశ్వసిస్తున్నారు. అయితే, జనసేన అధినేతను కలిశాక, ఆమెకు మద్దతు పలుకుతున్నట్లు జనసేనాని ఒక్క మాట కూడా చెప్పలేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పైగా, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి.. అని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకోవడమేగానీ, జనసేన నాయకులెవరూ ఆమెకు బాహాటంగా మద్దతు పలకడంలేదన్న వాదనలున్నాయి. ఇంకోపక్క, రత్నప్రభ వైఎస్సార్ అభిమాని అనే కోణంలో జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె గతంలో వేసిన ట్వీట్లను జత చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం వుండడం బీజేపీ – జనసేన శ్రేణుల మధ్య సఖ్యత ఇంకా కుదరకపోవడంతో రత్నప్రభను బలిపశువుగా మార్చేశారన్న చర్చ కూడా జరుగుతోంది.
కాంగ్రెస్ నేత ఒకరు ఈ వ్యవహారాలపై స్పందిస్తూ, గతంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన చిరంజీవి, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారనీ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు అంతటి గుర్తింపు ఇచ్చింది గనుక, జనసేన పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ, జనసేనాని తిరుపతిలో రత్నప్రభకు అనుకూలంగా ప్రచారం చేస్తారా.? పార్టీ శ్రేణుల్నిపూర్తిగా బీజేపీకి సహకరించేలా ఉత్తేజపరుస్తారా.? అనే ప్రశ్నలకు సమాధానమెప్పుడు దొరుకుతుందో.