తమిళనాడు రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఎన్నికల హడావుడి మొదలైంది. పొత్తులు, కొత్త పార్టీల ఆవిర్భావాలు, ఎత్తులు, పైఎత్తులు అంటూ రోజుకో ఆసక్తికరం అంశం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని ప్రకటించేసిన రజినీకాంత్ ఆసక్తిని క్రియేట్ చేయగా విశాల్ ఎన్నికల బరిలో నిలవడానికి సిద్దమయ్యారు. ఇక కమల్ హాసన్ ఏఐఎమ్ఐఎమ్ పార్టీతో పొత్తుకు సిద్దమై మరో సంచలనానికి తెరలేపారు. గత కొన్నిరోజులుగా కేవలం పుకారుగానే ఉన్న ఈవార్త నిజమైంది. ఇప్పటికే ఇరు పార్టీల మధ్యన పొత్తు ఒప్పందం కుదిరిపోయింది. కమల్, ఒవైసీలు అధికారిక ప్రకటన చేయడం మాత్రమే మిగిలుంది. కమల్ హాసన రాజకీయ లక్ష్యాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. మత ప్రాతిపదికన రాజకీయం చేయడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తి మతప్రాతిపదికన నడిచే మజ్లిస్ పార్టీతో జత కట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.
మరి విరుద్ధ స్వభావాలు కలిగిన ఈ రెండు పార్టీలకు ఎక్కడ లంకె కుదిరింది అంటే అది బీజేపీ విషయంలోనే అనాలి. కమల్ హాసన్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. వారి విధానాలను అసంబద్దమైనవని ఆరోపిస్తుంటారు. ఇప్పటికే పలుశాలురు మోదీ విధానాలను తప్పుబట్టిన ఆయా రైతుల విషయంలో కూడ నిప్పులుచెరిగారు. ఇక మజ్లిస్ స్వభావం గురించి చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ వారికీ బద్ద శత్రువు. బీజేపీని పడగొట్టడమనేది వారి ప్రధాన ఎజెండాల్లో ఎప్పటికీ ఉంటుంది. గ్రేటర్ ఎన్నికలో ఇరు పార్టీలు ఎలా ఢీకొన్నాయో అందరూ చూశారు. అలా శత్రువుకు శత్రువు మిత్రుడే కదా అనే ఫార్ములాతో బీజేపీని వ్యతిరేకించే రెండు పార్టీలు ఒక్కటికానున్నాయని అనుకోవచ్చు.
తమిళనాడులో 5.8 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనిత్తనేయ మక్కల్ కట్చి, మనిత్తనేయ జననాయగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తౌహీద్ జమాత్ లాంటి ఇతర ముస్లిం పార్టీలను ఒకడాగారకు చేర్చి వాటికి సారథ్యం వహిస్తూ కమల్ పార్టీతో కలిస్ ఒవైసీ భావిస్తున్నారట. అంతేకాదు కనీసం 25 స్థానాల్లో పోటీ చేయాలనేది మజ్లిస్ టార్గెట్ అని అంటున్నారు. వెల్లోర్, రానిపట్, తిరుపత్తూర్, కృష్ణగిరి, రామనాథపురం, పుద్దుక్కోట్టై, తిరుచ్చి, మధురై, తిరునల్వేలి జిల్లాల్లో ఒవైసీ టికెట్లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. తాజాగా గడిచిన బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ 20 స్థానాల్లో పోటీచేసి 5 స్థానాలను కైవసం చేసుకుంది సత్తా చాటుకుంది. కమల్ సైతం ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మజ్లిస్ పొత్తు కలిసొస్తుందని ఆలోచనలో ఉన్నారు.
ఇక రాబోయే ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీ సైతం పూర్తిస్థాయిలో పోటీచేయనుంది. రజినీ, కమల్ కలిసి నడుస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటికే పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి బలమైన ద్రవిడ పార్టీలను ఢీకొట్టాలంటే ఒంటరి బలం సరిపోదు. అందుకే ఇద్దరూ పొత్తుపెట్టుకుంటారనే అంచనాలున్నాయి ఓటర్లలో. మరి వారి కలయికే జరిగితే రజినీ, కమల్, ఒవైసీల క్రేజీ కాంబినేషన్ కుదిరి తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారిపోతాయి.