కృతి శెట్టి.. మొదటి సినిమా ‘ఉప్పెన’తో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. ఒక్క చిత్రంతోనే నాలుగైదు సినిమాల పాపులారిటీని గెయిన్ చేసింది. ‘ఉప్పెన’లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు నచ్చింది. అందుకే ఆమెకు ఆఫర్లు పెరిగాయి. ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి కూడ కొందరు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక గాసిప్ బయలుదేరింది. కృతి శెట్టి మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకోనుంది అని. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కలిసి త్వరలో ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘సర్కారు వారి పాట’ పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా కృతి శెట్టిని అనుకుంటున్నారని టాక్. వినడానికే ఇది వింత వార్తలా ఉంది. ఎందుకంటే మహేష్, కృతి శెట్టిల మధ్యన ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. కృతి శెట్టి వయసు 17 లేదా 18 అంతే. మహేష్ ఎంత కుర్రాడిలా కనబడినా ఆయన వయసు పెద్దదే. దగ్గర దగ్గర 45 సంవత్సరాలు. ఇద్దరికీ 25 ఏళ్ల పైనే వయసు బేధం ఉంది. ఒకప్పుడంటే ఇలాంటి వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. హీరో పెద్దవాడై హీరోయిన్ చిన్న వయస్కురాలైనా అంగీకరించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆమెనే గనుక హీరోయిన్ గా తీసుకుంటే విమర్శలను ఎదుర్కోక తప్పదు. అయినా మహేష్, అనిల్ రావిపూడిలకు ఈ విషయం తెలియదని అనుకోలేం. వారి లెక్కలు వారికుంటాయి. ఇవన్నీ వట్టి పుకార్లే అవ్వొచ్చు కూడ.