స్టార్ హీరోల స్థాయిలో నయనతార చకా చకా సినిమాలకు సైన్ చేస్తోంది. ఒక్కోసారి హీరోలు కూడ ఆమె ముందు దిగదుడుపే అనిపిస్తుంది. నెల క్రితమే డ్రీమ్ వారియర్ పిచర్స్ సంస్థలో రెండు కొత్త సినిమాలకు సైన్ చేసిన ఆమె తాజాగా ఇంకో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలను కూడ అభిషేక్ ఫిల్మ్స్ నిర్మించనుంది. ఇప్పటికే ‘నెట్రికారన్’, రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రాలతో పాటు ప్రియుడు విగ్నేష్ శివన్ సినిమా, ఫహాద్ ఫాజిల్ సినిమా చేస్తున్న నయన్ ఇంకో రెండు సినిమాలు ఒప్పుకుంది. వీటిలో ఒక చిత్రాన్ని విపిన్ డైరెక్ట్ చేయనుండగా మరొక సినిమాకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
నయనతార ఒక్కొక చిత్రానికి సుమారు 3 కోట్లకు పైగానే పారితోషకం డిమాండ్ చేస్తోంది. అయినా నిర్మాతలు ఆమెను అప్రోచ్ అవుతూనే ఉన్నారు. ప్రేక్షకుల్లో నయనతారకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెతో సినిమా అంటే మంచి బిజినెస్ ఖాయం. అందుకే నిర్మాతలు వెనుకాడటంలేదు. ఇవే కాదు తెలుగు, హిందీలో కూడ నయనతార చిత్రాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్ నందు ఒక కీ రోల్ చేస్తున్న నయన్ అట్లీ హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడ అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీ మొత్తం కష్టాల్లో ఉన్నా నయనతార మాత్రం చేతి నిండా సినిమాలతో ఖుషీగా ఉంది.