సీనియర్ నటుడు నరేష్ ఎందుకు ఫ్రస్ట్రేషన్‌కి లోనవుతున్నారు.? ‘మా’ తాజా మాజీ అధ్యక్షుడు నరేష్, తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అసలాయన మానసిక స్థితి ఏంటి.? అన్న అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి.
ఎన్నికల వేళ ఆరోపణలు సహజం. ఆ వేడి వాతావరణం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ వ్యవహారాల్లో తలమునకలైపోతారు.. అందర్నీ కలుపుకుపోతారు కూడా. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా వెల్లడించాడు.
‘ప్రకాష్ రాజ్ అనుభవం నాక్కావాలి.. నాగబాబు సలహాలు నాక్కావాలి.. రెండు ప్యానళ్ళ నుంచి గెలిచినవారందరి సహకారంతో ముందుకు నడుస్తా..’ అని విష్ణు ఓ వైపు చెబుతోంటే, ఇంకో వైపు విష్ణుకి ముందు ముందు ఎలాంటి సమస్యలూ రాకుండా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారు తమ తమ రాజీనామాల్ని ప్రకటించేశారు.
భవిష్యత్తులో అభిప్రాయ బేధాలు రాకూడదనీ, అలా అభిప్రాయ బేధాలు వస్తే, ‘మా’ ప్రతిష్ట మసకబారుతుందనీ, ‘మా’ అభివృద్ధి కూడా ఆగిపోతుందనీ రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెప్పడాన్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. వారి వాదనలోనూ వాస్తవం లేకపోలేదు.
ఇక, ‘మా’ పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మనసుకు కష్టంగా అనిపించిందంటూ సీనియర్ నటుడు బెనర్జీ, యువ నటుడు తనీష్, మరో నటుడు ఉత్తేజ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై స్పందించిన నరేష్, ‘ముండమోపి ఏడుపులు ఎందుకు.?’ అంటూ మండిపడ్డారు.
దారుణమై కామెంట్ ఈ ‘ముండమోపి ఏడుపు’ అన్న ప్రస్తావన. సీనియర్ నటుడు నరేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి.? ‘మా’లో చీలిక తెచ్చే దిశగా నరేష్ చెయ్యాల్సిందంతా ఇప్పటికే చేసేశారు. ఇంకా ఆయన ‘కసి’ చల్లారినట్టు లేదు. మోహన్ బాబు సైతం సంయమనం పాటిస్తున్నా, నరేష్ ఓవరాక్షన్ మాత్రం తగ్గకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.