రేటింగ్ : 2.75/5
రచన- దర్శకత్వం : రాహుల్ సాంకృత్యాయన్
తారాగణం : నాని, సాయి పల్లవి, కీర్తీశెట్టి, మడోన్నా సెబాస్టియన్, మురళీ శర్మా, జిశ్శూ సేన్ గుప్తా తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్,
ఛాయాగ్రహణం : సానూ జాన్ వర్ఘీస్
బ్యానర్ : నిహారికా ఎంటర్ టైన్మెంట్
నిర్మాత : వెంకట్ బోయినపల్లి
విడుదల : డిసెంబర్ 24, 2021
***
Shyam Singha Roy Review : గత మూడు సినిమాలతో నిరాశపడిన నాని కొత్త సినిమాలో ద్విపాత్రాభినయంతో విచ్చేశాడు. విజయ్ దేవర కొండతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ గా పీరియడ్ ప్రేమ కథని ప్రయత్నించాడు నాని. ఈసారి ఎంత వరకూ సక్సెస్ అయ్యాడో చూద్దాం…
కథ
వాసు (నాని) షార్ట్ ఫిలిమ్ తీసి సినిమా అవకాశాలు పొందాలని ప్రయత్నాల్లో వుంటాడు. ‘వర్ణం’ అనే షార్ట్ ఫిలింలో నటించడానికి నటి కోసం వేటలో వున్నప్పుడు సరీగ్గా పాత్రకి సరిపోయే కీర్తి (కృతీ శెట్టి) తారస పడుతుంది. నటించడంద్మ్ ఇష్టంలేని ఆమెని వెంటపడి ఒప్పిస్తాడు. నటిస్తున్నప్పుడామె అతడితో ప్రేమలో పడుతుంది. ఆ షార్ట్ ఫిలిమ్ బాగా తీశాడని నిర్మాత సినిమా అవకాశమిస్తాడు. కీర్తితో తను కూడా ప్రేమలో పడిన వాసు ఆమెతో సన్నిహితంగా వున్న సమాయంలో రోజీ అనే వేరే అమ్మాయి పేరు ఉచ్ఛరిస్తాడు. కీర్తి ఛీ కొట్టి వెళ్ళి పోతుంది.
వాసు సినిమా తీసి దాన్ని కూడా సక్సెస్ చేయడంతో హిందీలో రీమేక్ ఆఫర్ వస్తుంది. ఇంతలో ఒక పబ్లిషర్ వాసు తీసిన సినిమా తాము ప్రచురించిన బెంగాలీ నవలకి కాపీ అని కేసేస్తాడు. వాసు అరెస్టవుతాడు. ఆ నవల యాభై ఏళ్ళక్రితం సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శ్యామ్ సింఘారాయ్ అనే అతను రాశాడు. అతనెవరో తనకి తెలీదనీ, ఆ నవల తాను చదవలేదనీ వాదిస్తాడు వాసు.
కానీ సింఘారాయ్ తో అతడికి సంబంధముంది. ఏమిటా సంబంధం? దీంతో పశ్చిమ బెంగాల్లో రోజీ అలియాస్ మైత్రేయి (సాయి పల్లవి) కేం సంబంధం? ఈ కేసులోంచి వాసు ఎలా బయటపడ్డాడు? బయట పడినప్పుడు ఏఏ విషయాలు బయట పడ్డాయి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
పునర్జన్మ కథల జానర్లో రోమాంటిక్ డ్రామా ఇది. పునర్జన్మల కథంటేనే పాతబడని బాక్సాఫీసు ఫ్రెండ్లీ ఫార్ములా. అయితే ఇప్పుడున్న పాత్రలు పూర్వ జన్మ గుర్తుకు రావడంతో పూర్వ జన్మలోకి కథ ప్రయాణించడమనే ఒకే అరిగిపోయిన టెంప్లెట్లో సినిమాలు వుంటున్నాయి. ఇప్పుడీ పునర్జన్మల కథలకీ ఫ్యాక్షన్ సినిమాల కథలకీ తేడా లేకుండా పోవడంతో పునర్జన్మల కథలతో సినిమాలు చూస్తూంటే ఫ్యాక్షన్ సినిమాలు చూస్తున్నట్టే వుంటున్నాయి. ఫ్యాక్షన్ సినిమాల్లో ఇంటర్వెల్ వరకూ ప్రధాన పాత్ర ఒక క్యారక్టర్. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో రాయల సీమలో అదే ప్రధాన పాత్ర వేరే క్యారక్టర్ అన్నట్టు – పునర్జన్మల సినిమాల్లో ఈ జన్మలో వున్న ప్రధాన పాత్రకి తలకి దెబ్బ తగిలో, మరేదో జరిగో పూర్వ జన్మ గుర్తుకు రావడం, ఆ పూర్వ జన్మని ఇంకో తన పోలికలున్న పాత్రతో కథ చూపించడం.
‘శ్యామ్ సింఘారాయ్’ కూడా ఈ టెంప్లెట్ ని తప్పించుకోలేక పోయింది. ఈ టెంప్లెట్లో ఫ్యాక్షన్ సినిమాలు అలవాటవడం వల్ల ‘శ్యామ్ సింఘారాయ్’ చూస్తూంటే పునర్జన్మ కథ చూస్తున్నఫీల్ వుండదు. చూస్తున్నప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకు రాకపోతే వేరే సంగతి.
ఇది గ్రహించి టెంప్లెట్ ని రివర్స్ చేసే ప్రయత్నం సినిమాల్లో జరగడం లేదు. అంటే వెనకటి జన్మలో వున్న పాత్ర, రానున్న జన్మని దర్శించడం. అంటే పూర్వ జన్మ నుంచి కథ ఇప్పుడు మనముంటున్న ప్రస్తుత కాలంలోకి ప్రయాణించడం. ఇలాటి కథలున్నాయి. ఈ ప్రాచీన జపనీస్ కథా ప్రక్రియని ఇసెకాయ్ అన్నారు. ఈ ప్రక్రియతో జపనీస్ లో నవలలు, మంగా కామిక్స్, వీడియో గేమ్స్ వచ్చాయి. సింపుల్ గా చెప్పుకుంటే, 1970 లలో వున్న శ్యామ్ సింఘారాయ్ ముందు కాలంలో కెళ్ళి, 2021 లో సినిమా డైరెక్టర్ గా వున్న వాసుగా వస్తే ఏమవుతుంది? పురాణ పాత్రలు ఆధునిక మానవ ప్రపంచంలో కొచ్చి కామెడీలు చేసే సినిమాలు ఆల్రెడీ వున్నాయి.
‘శ్యామ్ సింఘారాయ్’ లో దేవదాసీ దురాచార కథతో పునర్జన్మ చూపించారు. పునర్జన్మ అంటేనే సెంటిమెంటు, నమ్మకం. స్టార్స్ తో తీసే రోమాంటిక్ డ్రామాల్లో దీనికి లాజికల్ ముగింపు నివ్వకూడదు, ఎమోషనల్ ముగింపు నివ్వాలి. నమ్మకాన్ని లాజిక్కుల వాద ప్రతివాదాలతో నిరూపిస్తే ఆత్మిక దాహం తీరదు. సెంటిమెంటుతో కూడిన ఎమోషనల్ డ్రామాయే ఎవర్ గ్రీన్ ముగింపు. ‘శ్యామ్ సింఘారాయ్’ లో ఇలా చేసే అవకాశం వున్నా దాన్ని వేరే సెకండరీ డ్రామాకి వాడారు. దీంతో లాజిక్కా- సెంటిమెంటా తేల్చుకోవాల్సిన అవసరం ప్రేక్షకుల కేర్పడింది.
నటనలు సాంకేతికాలు
ఈ ద్విపాత్రాభినయంతో నాని ఇంకో మెట్టు ఎక్కాడు. ఫస్టాఫ్ లో తెలుగు వాడైన వాసు దేవ్ గా రెగ్యులర్ కమర్షియల్ ఫన్నీ క్యారక్టరే గానీ, సెకండాఫ్ లో బెంగాలీ వాడైన శ్యామ్ సింఘారాయ్ గా ఎక్కువ క్లాస్ గా, నీటుగా, పవర్ఫుల్ గా కన్పిస్తాడు. అయితే ఈ పవర్ఫుల్ గా చూపిస్తున్న పాత్రతో పవర్ఫుల్ పాత్ర చిత్రణయితే గానీ, కథయితే గానీ కనిపించవు.
1969 లో అతడి బెంగాలీ కుటుంబంలో చిన్నన్నకి తప్ప మిగతా ఇద్దరు అన్నలకి ఇష్టంలేని మార్క్సిస్టు భావజాలంతో రచనలు చేస్తూ, నక్సల్స్ సానుభూతి పరుడుగా వుంటాడు. వూళ్ళో దళితుణ్ణి నీరు ముట్టుకోనివ్వని అంటరాని తనాన్ని నిస్వార్ధంగా ధిక్కరిస్తాడు. పెద్దన్నలు ఆగ్రహిస్తే, మీ ఇల్లు బాగుండాలని మీ స్వార్ధం, ప్రపంచం బాగుండాలని నా స్వార్ధమని అంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయిన వాడు ఒక పెద్ద దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాట్యం చేస్తున్న బానిస దేవ దాసీలని చూస్తాడు. పండగలా జరుపుకుంటున్న ఈ దురాచారాన్ని ముందు ఆపాలని ప్రయత్నించకుండా, దేవదాసీల్లో మైత్రేయి (సాయి పల్లవి) అనే దేవదాసిని చూసి ప్రేమలోపడి, సుదీర్ఘ ప్రేమాయణం ప్రారంభినప్పుడు పాత్ర దిగజారిపోయింది. ఈ ప్రేమాయణం తన వ్యక్తిగత స్వార్ధమే అయింది తప్ప లోకం బావుండాలన్న స్వార్ధం కాలేదు.
మైత్రేయిని తను ప్రేమించినందుకే తనతో వచ్చేయమని అంటాడే తప్ప- ముందామెకి విముక్తి కల్గించి ఆ తర్వాత ప్రేమించుకో వచ్చులే అనుకోడు. ఆమెని ప్రేమించకపోతే తనలో సంఘ సంస్కర్త నిద్ర లేచే వాడు కాదేమో. ఆ మాటకొస్తే ఆమె ఒక్కర్నే కాదు, అక్కడున్న మొత్తం దేవ దాసీలందరికీ విముక్తి కల్గించాలి లోకం బాగుకోసం స్వార్ధమన్నప్పుడు.
ప్రేమించిన మైత్రేయిని తీసికెళ్ళి పోతున్నప్పుడు విలన్ గా చూపించిన దేవాలయ మహంత్ ని దారుణంగా అగ్నికి ఆహుతి చేసి చంపేస్తాడు. అప్పుడైనా మిగిలిన దేవదాసీలని కూడా వెళ్ళి పొమ్మని అనడు. మైత్రేయితోనే వెళ్ళిపోతాడు. జరుగుతున్నవి రోజువారీ తొమ్మిదిరోజులు చూపించిన దేవీ నవరాత్రులు. బెంగాల్ అంటేనే దేవీ నవరాత్రులు, దుర్గా పూజ. ఈ ఉత్సవాల్లో దుర్గా మాత జాడే వుండదు.
దాసీలని తయారు చేయమని దేవుడనలేదని పదే పదే అంటాడు తప్ప- దుర్గా మాతని ప్రస్తావించడు. సాక్షాత్తూ దుర్గా దేవి విగ్రహం ముందే ఈ దురాచారంతో నాట్య ప్రదర్శనలు జరుగుతున్నట్టు చూపించి వుంటే ,ద్వంద్వాలతో కూడిన మంచి డ్రామా క్రియేటయ్యేది. అప్పుడా ఘర్షణలో దుర్గా దేవి త్రిశూలం గుచ్చుకుని మహంత్ చస్తే, అది థ్రిల్లింగ్ గా మాస్- క్లాస్ ఎమోషనల్ అప్పీలుతో బాక్సాఫీసుకి మేలు చేసే దైవిక న్యాయంగా వుండేది.
శ్యామ్ ఏం చేసినా రివర్స్ లో చేస్తాడు. మైత్రేయిని పెళ్ళి చేసుకుని కాపురం పెట్టాక, కొన్నాళ్ళ తర్వాత రచనలు చేసి సంపాదించిన డబ్బుతో ఇప్పుడు ఇల్లు కట్టుకుందా
మంటాడు. ఇప్పుడు కూడా స్వార్ధమే. అవతల వదిలేసిన దేవదాసీల గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే, ముందా దేవదాసీలని విడిపించి వాళ్ళకి ప్రభుత్వ నివాసాలూ పెన్షన్లూ కల్పించమని మైత్రేయి అంటే గానీ అందుకు పూనుకోడు!
ఇంట్లోంచి వెళ్ళిపోయిన చాన్నాళ్ల తర్వాత పెద్దన్నకి బాగాలేదని, చూడాలని వుందని కబురొస్తే, వెళ్ళి ముందు అన్నని పరామర్శించకుండా, భోజనం చేస్తూ కూర్చుంటాడు!! అనారోగ్యంతో వున్న అన్న మూల్గుతూ వచ్చి పలకరిస్తాడు. అప్పటికి శ్యామ్ సామాజిక నవలలు రాసి మహా రచయితగా ప్రఖ్యాతి పొంది వుంటాడు. మైత్రేయిని పెళ్ళి చేసుకుని కూడా వుంటాడు. ఈ విషయం తెలియక అన్న సంబంధం చూశానని అంటే, పళ్ళెం లో చేయి కడిగేసుకుని తనకి పెళ్ళయ్యిందని అంటాడు. పెళ్ళి గురించే నన్ను పిలిచి వుంటే మీకు బై అని వెళ్ళి పోతూంటాడు. ఇది మహా రచయిత ప్రవర్తన కాదేమో? ఒక రచయిత కుండాల్సిన పరిపక్వతతో అన్నతో మాట్లాడి విషయం తెలియ జేయవచ్చేమో? తను చేసుకున్నపెళ్ళిని ఒప్పించవచ్చేమో?
ఇలా చేయడు. దీంతో అన్నేమో ఇంత పొడుగు కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇంకో అన్న వెనుక నుంచి పొడుస్తాడు. ఇదేమైనా పాత్ర పట్ల అయ్యో అని సానుభూతి కల్గించే సన్నివేశమా? ఇది చేతకాని మహా రచయిత చేతులారా తెచ్చుకున్న చావు తప్ప మరేమీ కాదు. దీనికి తనకో పునర్జన్మ ఒకటి! చెప్పుకుంటే ఇంకా వున్నాయి, వదిలేద్దాం. నేచురల్ స్టార్ నాని పాత్ర పోషణ వరకూ ఓకే, కానీ ఇలా అన్నేచురల్ పాసివ్ పాత్రలు చేయడమే సమస్య.
దాసిగా, భార్యగా సాయిపల్లవి సో బ్యూటీఫుల్. ఆడియెన్స్ కి హోమ్లీ ఫీల్. ఆమె డాన్స్ విజువల్ ట్రీట్. ఆమె క్యారక్టర్ మాత్రం క్యారక్టర్ అన్పించకుండా పై పై గ్లామర్ గా వుంటుంది. ప్రతీ రాత్రీ ఒక దాసీని అనుభవించే మహంత్ చేతిలో తనూ పడి వుంటుంది తప్పక. ఇది చూపించక పోయినా అర్ధమదే. కానీ ఏ గిల్టీ లేకుండా, అభ్యంతర పెట్టకుండా శ్యామ్ ని ప్రేమిస్తుంది. ఆనందంగా పెళ్ళి చేసుకుంటుంది. అప్పుడు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ అంటుంది. ఇలా అన్నప్పుడు కూడా భర్త శ్యామ్ పట్ల గిల్టీ ఫీలవ్వదు. తనలాంటి దాన్నిపెళ్ళి చేసుకోవడమే అతను చేసిన త్యాగం. ఇప్పుడు పిల్లలు పుట్టక పోతే కూడా త్యాగమే చెయ్ అన్నట్టుంటుంది ఆమె వరస. ఏ మాత్రం గిల్టీ వుండదు.
మధ్యలో ఈ పిల్లలు పుట్టరని డాక్టర్ సీనెందుకంటే, లేకపోతే పిల్లలు పునర్జన్మ కథకి అడ్డం. కథకి అడ్డమని చెప్పి పాత్ర చిత్రణల్ని కిల్ చేయడం. తీస్తున్నది ఏ గ్రేడ్ మూవీ అన్నప్పుడు ఇలా బి గ్రేడ్ కథ చూపిస్తే ఎలా? పిల్లలు పుట్టరనే పాయింటునే తీసుకుని శ్యామ్ – మైత్రేయిల కథని హృదయవిదారంగా, కలకాలం గుర్తుండేలా చేయవచ్చు పాత్రల్ని నిలబెడుతూ. తనకి పిల్లలు పుట్టరనే కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోబోతే- అతను కాపాడబోయి చనిపోతే ఉద్విగ్నంగా ఒకలా వుండేది- ఎమోషనల్ కనెక్ట్ తో- అనవసరంగా కథకుపయోగపడని అన్నల చేతిలో చావడం కాకుండా. రోమాంటిక్ డ్రామా నింగి అంచుల్ని తాకేది.
ఇక ఫస్ట్ హీరోయిన్ గా కృతీ శెట్టి, లాయర్ గా మడొన్నా సెబాస్టియన్ బావున్నారు. ఇంకో లాయర్ గా మురళీ శర్మ కోర్టులో తన ఎక్స్ ప్రెషన్స్ తో ఓకే. టెక్నికల్ గా కెమెరా, బిజీఎం, పీరియెడ్ వాతావరణం, సెట్స్, కాస్ట్యూమ్స్ ఉన్నతంగా వున్నాయి. మిక్కీ మేయర్ సమకూర్చిన పాటలు కూడా స్క్రీన్ మీద ఓకే. సంభాషణలు బావున్నాయి.
చివరికేమిటి
ఫస్టాఫ్ వాసు పాత్రతో, సెకండాఫ్ శ్యామ్ పాత్రతో వుంటుంది. వాసు పాత్రని చూపిస్తున్నప్పుడు పునర్జన్మ పాయింటుకి లీడ్ చేసేలా – ఫోర్ షాడోయింగ్ లా – ఇరవై నిమిషాల నుంచే మూడు నాల్గు సార్లు వాసు చెవిలోంచి రక్తం కారుతుంది. ఈ రక్తం కా రడానికీ పూర్వజన్మకీ సంబంధం ఏమిటో చూపలేదు. ఏదో స్ట్రెస్ వల్ల రక్తం కారుతున్నట్టు చెప్పారు. పూర్వజన్మ తో కనెక్ట్ అయ్యే భౌతిక వ్యక్తీకరణ అన్నట్టు వుండాల్సింది అసలుకైతే. పూర్వజన్మలో అన్నలు చంపినప్పుడు చెవిలోంచి కూడా రక్తం కారి వుంటే- అదే ఈ జన్మలో రుణం తీర్చుకోమని గుర్తు చేస్తున్న రక్త స్రావంగా వుంటే, మెలో డ్రామాతో కథనం బావుండేది. ఇలా కథనంలో అనేక చోట్ల ఆవినాభావ సంబంధాన్ని పట్టించు కోకుండా పైపైన సీన్లు సృష్టించారు.
సెకండాఫ్ లో మళ్ళీ అరగంట ఈసారి పీరియెడ్ ప్రేమకథ. ఫస్టాఫ్ లో షార్ట్ ఫిలిమ్ నేపథ్యంలో ఒక లవ్ ట్రాక్. సెకండాఫ్ లో పీరియెడ్ నవరాత్రులు నేపథ్యంలో రోజుకో దృశ్యం చొప్పున తొమ్మిది రోజులు తొమ్మిది ప్రేమ దృశ్యాలతో లవ్ ట్రాక్. శ్యామ్ పాత్ర మార్క్సిస్టు భావజాలంతో ఏదో చేస్తానని ఇంట్లోంచి వెళ్ళిపోయిన లక్ష్యం ఇక వుండదు. ప్రేమ కథే వుంటుంది. ఆ తర్వాత కాపురం కథ, మరణం. ఇదంతా చాలా స్లోగా వుంటుంది.
తిరిగి ఫస్టాఫ్ లో ఆపిన కోర్టు కేసుకి వస్తుంది కథ. ఇప్పుడు వాసు ఆ శ్యామ్ సింఘారాయ్ తానేనని కోర్టులో వాదిస్తాడు. ఇది తేల్చడానికి వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు, లాజికల్ ప్రశ్నలు. వాసూ శ్యామ్ ఒకేలా వున్న ఫోటోలు చూపిస్తే కేసు తేలిపోతుంది. ఇలా చేయకుండా ఇంకేవో ఎవిడెన్సులతో తర్జనభర్జన. అయోధ్యలో రామాలయం వుండేదని పాపులర్ సెంటిమెంటు అనీ, ఇంకే సాక్ష్యాలూ అవసరం లేదనీ, సుప్రీం కోర్టు పాపులర్ సెంటిమెంటు ఆధారంగానే అనుకూల తీర్పు ఇచ్చిందనీ, అలాగే పునర్జన్మ అంశం కూడా పాపులర్ సెంటిమెంటు అనీ, దీన్నీసాక్ష్యాధారాలతో నిరూపించలేమనీ వాదనలు.
నిజమే, అక్కడికే వద్దాం. రివ్యూలో మొదటే చెప్పుకున్నట్టు పునర్జన్మల కథలకి లాజిక్స్ అనవసరం, సెంటిమెంట్స్ కే ఓటెయ్యాలి. కానీ లాజిక్స్ తో ఏదేదో చెప్పి నిరూపించారు సెంటిమెంట్స్ పాయింటు వదిలేసి. వాసు తన పూర్వజన్మ తెలుసుకుందామని కలకత్తాలో తిరిగినప్పుడు బతికున్న భార్య మైత్రేయిని కోర్టుకి తీసుకొచ్చి చూపించొచ్చు కదా? అనూహ్యంగా ఈ సీను వేసి కోర్టులో డ్రామా, ఎమోషన్స్, పాథోస్ వగైరా వగైరా ఎలిమెంట్స్ తో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి- వారెవ్వా ఏం కథ చెప్పాడన్పించుకోవచ్చు కదా? కోర్టులో లాజికల్ గా గెలిచి, తర్వాత బతికున్న మైత్రేయిని వాసు కలుసుకుంటే కథకేం ఉపయోగపడిందనీ?
కోర్టు డ్రామాతో బాటు క్లయిమాక్స్ ఇందుకే ఫ్లాట్ గా వున్నాయి. మొత్తంగా ఈ మూవీని ఎక్కువ ఆలోచించకుండా అభిమాన స్టార్స్ ని చూస్తూ అలా అలా ఎంజాయ్ చేసేస్తే మంచి ఎంటర్ టైనర్. చాలా రోజుల తర్వాత వయొలెన్స్ లేని కలర్ఫుల్ రోమాంటిక్ డ్రామా.
—సికిందర్