హీరో నాని చేస్తున్న చిత్రాల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఒకటి. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. కలకత్తా నేపథ్యంలో సాగే పిరియాడికల్ డ్రామా. అందుకే భారీ బడ్జెట్. నిజానికి ఇది నాని మార్కెట్ స్థాయికి మించిన బడ్జెట్. అందుకే మొదటి నుండి నిర్మాతలు ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా వృథా, అనవసర ఖర్చులు ఉండకూడదని అనుకున్నారు. కానీ ఆ నష్టం జరిగిపోయింది. కరోనా ఆంక్షల రీత్యా కలకత్తాలో సినిమా షూటింగ్ వీలుకాలేదు. అందుకే టీమ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.
నగర శివార్లలో కలకత్తా సెట్ వేసి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సెట్ నిర్మాణంలో ఉండగానే రాష్ట్రంలో లాక్ డౌన్ పడుతుందా పడదా అనే మీమాంస మొదలైంది. అయినా మిండిగా సెట్ వేశారు. ఖర్చు 6 కోట్ల పైమాటే. ఇండస్ట్రీలో అందరూ షూటింగ్స్ ఆపినా ఈ సినిమా మాత్రం ఆగలేదు. చివరికి ప్రభుత్వం లాక్ డౌన్ అనడంతో ఆగిపోయింది. వేసిన సెట్లో సగం షూటింగ్ కూడ జరపలేదు. హైదరాబాద్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ కూడ ఓపెన్ ప్లేస్ సెట్స్ ఎక్కువ కాలం ఉంచరు. కానీ ఈ సినిమాకు మాత్రం ఉంచాల్సి వచ్చింది. ఈమధ్య అడపాదడపా కురిసిన వర్షాలకు ఆ సెట్ బాగా దెబ్బతిందట. దీంతో నిర్మాతకు సెట్ ఖర్చు వృథా పోయినట్టే అంటున్నారు.