హీరో నాని ‘టక్ జగదీష్’కి ఆంధ్రా సెగ.!

తన కొత్త సినిమా ‘టక్ జగదీష్’ థియేటర్లలోనే విడుదలవ్వాలని కోరుకున్నప్పటికీ, నిర్మాతలు.. అలాగే పంపిణీదారుల శ్రేయస్సు కోరి, నిర్ణయం వారికే వదిలేస్తున్నాననీ హీరో నాని భావోద్వేగంతో కూడిన లేఖ విడుదల చేశాడు సోషల్ మీడియా వేదికగా అభిమానుల్ని ఉద్దేశించి. నిర్మాణ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఓటీటీలోనే సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, నాని రాసిన లేఖలో ‘ఆంధ్రాలో అనుకోని పరిస్థతుల కారణంగా..’ అంటూ ప్రస్తావించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే వుంది. అక్కడ కరోనా కేసులు ఇంకా వెయ్యి నుంచి 1500 వరకు నమోదవుతున్నాయి ప్రతిరోజూ. దాంతో, సినిమా థియేటర్లు తెరచినా 50 శాతం ఆక్యుపెన్సీ అలాగే కేవలం మూడు షోలకు మాత్రమే అనుమతిస్తోంది అక్కడి ప్రభుత్వం.

దీనికి తోడు, సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గిస్తూ ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ దెబ్బకి చాలా రాజకీయ విమర్శలొచ్చాయి. అయితే, ఆ తర్వాత విడుదలైన సినిమాలకి మాత్రం అడ్డగోలుగా టిక్కెట్ల రేట్లు పెంచేశారు.. రాజకీయ నాయకుల రంగ ప్రవేశంతో పెద్ద మాఫియా నడిచిందన్న విమర్శలూ లేకపోలేదు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. ఇటీవల ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ తదితర సినిమాలు రిలీజయ్యాయి. వాటికి లేని సమస్య, ‘టక్ జగదీష్’ సినిమాకి ఎందుకు వస్తుంది.? అంటే, ఇది పెద్ద సినిమా గనుక. ‘టక్ జగదీష్’ సినిమా కోసం టిక్కెట్ల రేట్ల పెంపుని ఆ చిత్ర బృందం ఆశించింది. అది కుదిరే పరిస్థితి లేకపోవడంతో, తక్కువ రేట్లతో సినిమాని విడుదల చేస్తే ఇబ్బంది అన్న కోణంలో ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఇంకో వాదన. ఏదిఏమైనా, ‘ఆంధ్రా’ ప్రస్తావన తీసుకురావడం ద్వారా నాని చాలామందికి విరోధి అయినట్టున్నాడు. సోషల్ మీడియాలో నానికి విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతోంది.