అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు ఇంకో ముఖ్యమైన పని కూడ చేస్తున్నారు. అదే మ్యూజియం. మ్యూజియం అంటే ఏదో సినిమా కాదు. నిజంగానే మ్యూజియం. నాగార్జునకు ఇక మ్యూజియం కట్టాలనే కోరిక ఉందట. అయితే అది పురాతన వస్తువులు ఉంచే మ్యూజియం కాదు. సినిమా చరిత్రను నిక్షిప్తం చేసే మ్యూజియం. ముందు తరాలకు తెలుగు సినిమా చరిత్ర తెలిసేలా చేయడం కోసం ఒక సినిమా మ్యూజియం ఉండాలనేది నాగార్జున కొరికట.
ఆ మ్యూజియంలో తెలుగు సినిమా చరిత్ర మొత్తం డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉండాలట. ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు సేకరణకు వీలు లేకుండా మరుగున పడిపోయాయి. వాటిలో ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు కూడ ఉన్నాయి. మ్యూజియం సేకరణలో భాగంగా నాగార్జున ముందుగా తన తండ్రి సినిమాలను సేకరించడం మొదలు పెట్టారట. ఇప్పటికే కొన్ని సినిమాలను కలెక్ట్ చేశారట కూడ. అరుదైన అన్ని సినిమాలను సేకరించి డిజిటల్ పద్దతిలో తెలుగు తరాలకు అందుబాటులో ఉంచాలనేది నాగార్జున లక్ష్యమట.