పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. కొంచెం ఈగో కామన్. కానీ ఈ తరం వారసుల్లో అది పెద్దగా లేదనే అనాలి. పంతాలు, పట్టింపులు లేవు వారిలో. గతంలో ఒక హీరో నోటి వెంట ఇంకొక హీరో పేరు రావడమే గగనం. ఏ ఐదారేళ్ళకో ఒక మల్టీస్టారర్ వచ్చేది. ఇక సెకండ్ జెనరేషన్ హీరోల్లో అయితే అది మరీ తక్కువ. ఒకానొక దశలో మల్టీస్టారర్ అనే పదాన్నే మర్చిపోయారు ప్రేక్షకులు. కానీ మూడో తరం హీరోలు అలా లేరు.
మల్టీ స్టారర్ అంటే ఆసక్తి చూపుతున్నారు. ఒకరి సినిమాల్లో ఒకరు నటిస్తున్నారు. సినిమాల్లో వేరొక హీరోల ప్రస్తావన తేవడం, వారిని పొగడటం చేస్తున్నారు. తాజాగా అక్కినేని వారసుడి నాగ చైతన్య లాంటి పాత్రే ఒకటి చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో చైతూ సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమానిగా కనిపించనున్నాడు. థియేటర్ల దగ్గర మహేష్ కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, పూల వర్షాలు కురిపించడం లాంటి సన్నివేశాలను కూడ చేస్తున్నారు. ఇలాంటి సీన్లలో నటించడం అంటే పెద్ద హీరోలు కాస్త ఆలోచిస్తారు. కానీ చైతూ మాత్రం చేసేస్తున్నాడు.