ఓటీటీకి నాగ చైతన్య సినిమా

ఓటీటీల జోరు బాగా పెరిగింది. సినిమా హాళ్లు తెరుచుకోకపోకడం, సినీ ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమాలకు బాగా అలవాటు పడటంతో నటీనటులు ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. స్టార్ హీరోలు సైతం ఓటీటీల్లో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. మీడియం నుండి పెద్ద స్థాయి హీరోలు కూడ ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే నేరుగా ఓటీటీలకే సినిమాలు చేసేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఓటీటీకి ఒక ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంకాగా ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య సైతం ఓటీటీలో సినిమా చేయడానికి మొగ్గుచూపుతున్నాడు.

ఇప్పటికే దీనికి సబంధించి కథ కూడ లాక్ అయిందట. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. దర్శకుడు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. ప్రజెంట్ నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీని పూర్తి చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు హిందీలో ఆమిర్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ ఒక కొలిక్కి వచ్చన తర్వాత ఓటీటీ ప్రాజెక్ట్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇవే కాకుండా కొందరు కొత్త దర్శకులు చెబుతున్న కథలకు కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రాసెస్లో ఉన్నాడట చైతన్య.