దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా మరో సంఘటన చోటు చేసుకుంది. హనుమాన్ ఆలయం కోసం ఓ ముస్లిం రూ.80లక్షల విలువైన తన భూమిని విరాళంగా ఇచ్చారు. బెంగళూరులోని కడుగోడీలో ఉంటున్న హెచ్ఎంజీ బాషా అనే వ్యక్తి బెంగళూరు ,హోసకెటో హైవే సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయ విస్తరణకు కోసం తన భూమిని ఇచ్చారు.

కార్గో బిజినెస్ మ్యాన్ అయిన బాషాకు బెంగళూరు రూరల్ జిల్లాలోని వలెగెరపురా అనే గ్రామంలో మూడెకరాల స్థలం ఉంది. హనుమాన్ ఆలయాన్ని విస్తరించాలనుకొని ఆరు నెలల క్రితం దేవాలయ ట్రస్టీలు బాషాను స్థలం కోరారు. అప్పుడే ఆ విషయాన్ని అంగీకరించిన ఆయన.. ప్రస్తుతం తన భూమిలోని కొంత స్థలాన్ని ఆలయానికి ఇచ్చేశారు.
ట్రస్టీలు ఆయనను 1.5 సెంట్లు అడిగితే ఆయన ఏకంగా ఒకటిన్నర గుంటల భూమి విరాళమిచ్చారు. దీని విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉంటుంది. దీంతో బాషా విరాళమిచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఆలయం ముందు ఓ ఫ్లెక్సీని పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాషాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రజల్లో హిందూ, ముస్లింలు వేరే అన్న భావన ఉండదు. కొందరు స్వప్రయోజనాల కోసం విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందరం ఐకమత్యంతో ఉంటూ దేశాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉంది అని బాషా అన్నారు
