చిరంజీవి ‘పెద్దరికాన్ని’ మోహన్ బాబు గుర్తించట్లేదెందుకు.?

తెలుగు సినీ పరిశ్రమకు ఒకప్పుడు పెద్దన్న దాసరి నారాయణరావు. ఆయన మరణం తర్వాత పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయిందన్న భావన అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని, ‘పెద్దన్నగా’ కొందరు సినీ ప్రముఖులు ప్రొజెక్ట్ చేశారు. పరిశ్రమ పెద్దలపై ఎప్పటికప్పుడు పరిశ్రమలోని ప్రముఖులు చిరంజీవితో మంతనాలు జరిపేవారు. ఆ సమస్యల్ని చిరంజీవి నేతృత్వంలోనే ప్రభుత్వం దృష్టికి సినీ పరిశ్రమ తీసుకెళుతూ వస్తోంది.

కానీ, చిరంజీవి పెద్దరికాన్ని నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు తదితరులు గుర్తించడంలేదు. తాజాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో మోహన్ బాబు అనూహ్యంగా తన కుమారుడు మంచు విష్ణుని బరిలోకి దింపారు. ‘మెగా కాంపౌండ్ నుంచి ఎవరైనా బరిలోకి దిగి వుంటే, నేను విష్ణుని పోటీకి దింపేవాడిని కాదు..’ అంటూ మోహన్ బాబు తాజాగా సెలవిచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కి చిరంజీవి ఆశీర్వాదం వుందనే ప్రచారంమొదటి నుంచీ జరుగుతోంది. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ.

‘మెగా ప్యానెల్’ అనే ముద్ర ప్రకాష్ రాజ్ బృందంపై పడినప్పుడు, మంచు విష్ణుని ఎలా మోహన్ బాబు రంగంలోకి దింపినట్లు.? ‘చిరంజీవితో నాకు మంచి స్నేహం వుంది..’ అని చెబుతూనే, దాసరి మరణం తర్వాత తెలుగు సినిమాకి పెద్ద దిక్కు పోయిందనీ, ఎవరైనా పరిశ్రమ పెద్దలుగా తమను తాము భావిస్తే అది తనకు తెలియదనీ మోహన్ బాబు చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
చిరంజీవితో మోహన్ బాబుకి అంత స్నేహం వున్నప్పుడు.. చిరంజీవి కేంద్రంగానే, పరిశ్రమ సమస్యలపై పరిష్కారాలు వెతికేందుకు చర్చలు జరుగుతున్నప్పుడు.. చిరంజీవి పెద్దరికాన్ని మోహన్ బాబు గుర్తించకపోతే ఎలా.?