కృష్ణాజిల్లా మచిలీపట్నం లో వైకాపా మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావుని దుండగులు కత్తితో పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. దీంతో మచిలీపట్నంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం అలముకుంది. వైకాపా కార్యకర్తలు స్పాట్ కు, ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో, పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక ఘటన విషయం తెలియగానే మంత్రి నాని హుటాహుటిన బయలు దేరి వెళ్లారు. అనుచరుడి మృతదేశాన్ని చూసి నాని కన్నీటి పర్యంతం అయ్యారు. భాస్కరరావు మృతిపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు.
తాజాగా ఈ ఘటనపై నాని మీడియాతో స్పందించారు. ఇది రాజకీయ హత్య. తనని రాజకీయంగా ఎదుర్కోలేక కిరాయి గుండాలతో చంపిచారని ఆరోపించారు. హత్యకు మూడు రోజుల పాటు రెక్కి నిర్వహించి ఉంటారని మంత్రి తెలిపారు. ఘటనపై తనతో ఎస్పీతో సీఎం జగన్ మాట్లాడినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే భాస్కరరావు హత్యపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. మచిలీపట్నం మార్కెట్ యాడ్ లో భాస్కరరావు ఉండగా ఇద్దరు దుండగుల్లో ఒకరు కత్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఆ వెంటనే ఆ వ్యక్తిని మరోకడు బైక్ పై ఎక్కించుకుని పరారైన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అవ్వడంతో బయటకు వచ్చింది. వాటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఇక మంత్రి రాజకీయ హత్య అని వ్యాఖ్యానించడంతో సంచలనంగా మారింది. భాస్కరరావు హత్యకు తెలుగు రాష్ర్టాలో ఏ పార్టీ తో సంబంధం ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు అవినీతి, అక్రమాల కేసుల్లో అరెస్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులన్నీ అక్రమంగా బనాయించి జగన్ సర్కార్ తప్పులు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నాని అనుచరుడు కిరాతకంగా హత్యకు గురికావడం తో టీడీపీ నేతల హస్తం ఉందా? అని అనుమానం వ్యక్తం అవుతోంది.