లాక్ డౌన్ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై, చిత్ర పరిశ్రమ అనుమతులకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటి అయిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి చిత్రీకరణకు అనుమతిలచ్చేలా చర్యలు తీసుకుంటామని…పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అనుమతిలిస్తున్నట్లు, పరిస్థితులను బట్టి థియేటర్లు పున ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే పరిశ్రమ అభివృద్దికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు.
అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఇలాంటి భేటిలు లేకపోవడంతో టాలీవుడ్ పై పలువురు విమర్శలు గుప్పించారు. టాలీవుడ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి తప్ప ఏపీ ముఖ్యమంత్రి కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అంతకు ముందు సీఎం జగన్ ఏపీలో షూటింగ్ లకు అనుమతిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. తాజాగా చిరంజీవి జగన్ తో మాట్లాడినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, సింగిల్ విండో విధానంలో అనుమతుల జీవోను విడుదల చేసేందుకు పరిశ్రమ తరుపున జగన్ కి చిరు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు.
అలాగే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పరిశ్రమ సమస్యలపై, అభివృద్దిపై చర్చించేందుకు జగన్ కులుద్దామన్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పటికే చిరంజీవి ఏపీ సీఎం ను సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏపీలో పరిశ్రమ అభివృద్ది గురించి ఇరువురు చర్చించారు. అన్న చిరంజీవి సూచనలు, సలహాలు మేరకు అభివృద్ది చేద్దామని జగన్ తెలిపినట్లు చిరంజీవి చెప్పారు. పరిశ్రమ అభివృద్ది పై జగన్ చాలా ఆసక్తిచూపిస్తున్నారని ఇది అభివృద్దికి ఎంతో దోహద పడే అంశంమని మెగాస్టార్ చెప్పకనే చెప్పారు. అలాగే ఖాళీగా ఉన్న సినిమాటోగ్రఫీ శాఖకు ఓ మంత్రిని నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.