వంద కి.మీ సైకిల్ తొక్క‌నున్న మంచు ల‌క్ష్మీ.. కార‌ణం తెలిస్తే ప్ర‌శంసించ‌డం ఖాయం

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల త‌న‌య మంచు ల‌క్ష్మీ మంచి మాన‌వ‌తా వాది అన్న సంగతి మ‌నంద‌రికి తెలిసిందే. గ‌తంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన మంచు ల‌క్ష్మీ తాజాగా మంచి ఉద్దేశ్యంతో వంద కి.మీల సైక్లింగ్ చేసేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే 35 కి.మీ సైక్లింగ్ చేసిన మంచు వార‌మ్మాయి మిగ‌తాది కూడా పూర్తి చేస్తానంటుంది. క్రీడల్లో రాణించాలనే కోరిక ఉన్న పేద దివ్యాంగులను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణ ఇస్తోన్న ఆదిత్య మెహతా ఫౌండేషన్‌కు నిధులు సేకరించడానికి మంచు ల‌క్ష్మీ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

ఈ కార్య‌క్ర‌మంపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన మంచు ల‌క్ష్మీ. ఆదిత్యా మెహ‌తా ఫౌండేష‌న్ కోసం 35 కి.మీ సైకిల్ తొక్కిన‌ప్పుడు స్వ‌చ్చ‌మైన గాలి, వాస‌న‌, శ‌బ్ధం న‌న్ను ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. వంద కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేయ‌నున్న నేను ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ అండ్ రెహెబ్ సెంటర్‌లో శిక్షణ పొందనున్న పారా అథ్లెట్ల కోసం నిధులు సేక‌రిస్తున్నాను అని త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఫౌండేషన్‌కు గత ఆరేళ్లుగా తన సేవలను అందిస్తున్నారు మంచు లక్ష్మి. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ అండ్ రెహెబ్ సెంటర్‌‌ను నెలకొల్పి పారా అథ్లెట్లను తయారుచేస్తున్నారు.

వంద కిలో మీట‌ర్ల సైకింగ్ ఈ నెల 28తో ముగియ‌నుండ‌గా, అప్ప‌టి వ‌ర‌కు ఆమె నిధులు సేకరిస్తూ ఉంటారు. మొత్తం రూ.5 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారామె. ఇప్పటికి రూ.73 వేలు నిధులు సమకూరాయి. తన పిలుపు మేరకు మరింత ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తారని మంచు లక్ష్మి ఆశిస్తున్నారు. ఛారిటీ కోసం మంచు ల‌క్ష్మీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ని పలువురు ప్ర‌ముఖులు అభినందిస్తున్నారు. మంచు లక్ష్మి త్వరలో పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.