Manchu Family : మంచు కుటుంబం ‘మనం’ లాంటి ప్రయత్నం.!

Manchu Family :  అక్కినేని ఫ్యామిలీ మూవీగా ‘మనం’ బెస్ట్ ఎవర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. న భూతో న భవిష్యతి.. అనే స్థాయి సినిమా అది. అలాంటి సినిమాని మళ్లీ తెలుగు తెరపై చూడగలమా.? చూసే అవకాశం మేం కల్పిస్తాం అంటున్నారు ఈ సారి మంచు ఫ్యామిలీ.

మంచు ఫ్యామిలీలో పెద్ద తలకాయ్ మోహన్‌బాబుతో కలిసి విష్ణు, మనోజ్, లక్ష్మీ.. ఇలా నలుగురు సినీ నటులున్నారు. గొప్ప నటులే అనడం ఖచ్చితంగా అతిశయోక్తే అవుతుందనుకోండి. అయినా కానీ, ఈ ఫ్యామిలీ ‘మనం’ లాంటి ఓ సినిమా తెరకెక్కించాలని ఫ్యామిలీతో కలిసి గట్టిగా స్కెచ్ వేస్తున్నారట.

ఆల్రెడీ ఓ యంగ్ డైరెక్టర్‌ని ఎంగేజ్ చేశారట. కథ విషయంలో కసరత్తులు జరుగుతున్నాయట. మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోందట. కథ విషయంలో మంచు మనోజ్ సూచనలు, సలహాలు అందిస్తున్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా, ఇటీవలే ‘సన్నాఫ్ ఇండియా’ అంటూ మంచు ఫ్యామిలీ నుండి ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలీదు కానీ, సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ ఫ్యామిలీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, ఎవరో తమని తిట్టేస్తున్నారంటూ ఓ ఫన్నీ కాన్సెప్టు ప్రిపేర్ చేసి, తెలివిగా పబ్లిసిటీ ప్లాన్ చేశారు కానీ, పాచికలు పారనే లే. మోహన్ బాబు, విష్ణు ఈ సినిమాలో నటించారు.