SSMB29: టాలీవుడ్ దర్శకరుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా గురించి ఆ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి 1000 కోట్ల భారీ బడ్జెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక త్వరలోనే నాలుగవ షెడ్యూల్ కూడా మొదలుకానుంది. ఇందుకోసం ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నారట. ఇటీవల ఒడిశాలో ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఫోటోలు, వీడియోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. దాంతో అవుట్ డోర్ లో షూటింగ్స్ చేస్తే ఈ లీకుల బెడద తప్పదని కాశీలో చేయాలనుకున్న షూట్ మొత్తాన్ని సెట్ వేసి చేద్దామని ఫిక్స్ అయ్యారట జక్కన్న. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా కాశీ నగరం సెట్ వేస్తున్నారట. శివుడి ఆలయం, పలు ఆలయాలు, కాశీ రోడ్లు, గంగా నది, గంగా హారతి వేదిక ఇలా కాశీ నగరం మొత్తాన్ని సెట్ వేస్తున్నారట.
అయితే ఈ సెట్ కే దాదాపు 50 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ మోహన్ బింగి ఆధ్వర్యంలో ఈ సెట్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ దశలో ఉంది. ఒక సాంగ్, కొన్ని సీన్స్, యాక్షన్ సీన్స్ ని ఈ సెట్ లో షూట్ చేస్తారట. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భారీ సెట్ అని చెప్పాలి. ఇది ఇండియాలోనే ఇప్పటి వరకు హైయెస్ట్ అని తెలుస్తోంది. అయితే గతంలో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ సినిమా కోసం దాదాపు 15 కోట్లు ఖర్చుపెట్టి సెట్ వేశారు. ఇప్పటివరకు ఇండియాలో సెట్ కోసం అత్యధికంగా ఖర్చు చేసింది ఆ సినిమా కోసమే. ఇప్పుడు 50 కోట్లతో మహేష్,రాజమౌళి సినిమా సెట్ కోసం అత్యధికంగా ఖర్చుపెట్టిన సినిమాగా నిలిచింది.