‘మా’ బిల్డింగ్ అమ్మేసిందెవరు.? అక్రమాలకు పాల్పడిందెవరు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం గతంలో ఓ భవనం వుండేదట. దాన్ని ఆ తర్వాత అమ్మేశారట. 60 లక్షలు నష్టం వచ్చిందనీ, నష్టానికి అమ్మేశారనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క, కొత్త భవనం కోసం సినీ రాజకీయ రచ్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఒకప్పటి ‘మా’ అధ్యక్షుడు నాగబాబు స్పందించారు. తన హయాంలో భవనం కొనుగోలు చేసిన మాట వాస్తవమేననీ, కానీ ఆ తర్వాత అది శివాజీరాజా – నరేష్ హయాంలో విక్రయించడం జరిగిందనీ నాగబాబు చెప్పారు. తక్కువ ధరకే దాన్ని ఎందుకు అమ్మేశారన్న విషయమై మోహన్ బాబు అయినా, ఇంకొకరైనా నరేష్‌ని అడిగి సమాధానం తెలుసుకోవచ్చన్నది నాగబాబు వాదన. కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తాను వివరణ ఇవ్వగలనని నాగబాబు అంటున్నారు. అదే సమయంలో, తక్కువ ధరకు అమ్మేయడానికి సంబంధించి బలమైన కారణాలే వుండి వుండొచ్చనీ, ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం అయి వుండదనీ నాగబాబు అభిప్రాయపడటం గమనార్హం.

నాగబాబు ఎక్కడా ఎవర్నీ ఇక్కడ విమర్శించింది లేదు.. మా భవనానికి సంబంధించి. అదసలు భవనమే కాదన్నది తాజాగా శివాజీరాజా చేసిన వ్యాఖ్యల సారాంశం. అమ్మాలనే నిర్ణయం అందరం కలిసి తీసుకున్నామని శివాజీరాజా చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే, భవనం కొనడమైనా, అమ్మడమైనా సమిష్టి నిర్ణయం కారణంగానే జరిగింది. దీన్ని రాజకీయం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకుంటోన్నది ఎవరు.? అన్నదే కీలకం ఇక్కడ. ‘మా’ ఎన్నికలు కదా.. ఎవరి గోల వారిది. అయితే, తన మీద ఎవరైనా ఘాటుగా విమర్శలు చేస్తే, అంతకు మించి ఘాటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధమని నాగబాబు, శివాజీ రాజా విడివిడిగా అల్టిమేటం జారీ చేయడం గమనార్హం. నిజమే మరి.. అప్పుడు సైలెంటుగా వుండి, ఇప్పుడు యాగీ చేయడంలో అలా యాగీ చేస్తున్నవారికి కలిగే రాజకీయ లబ్ది ఏంటో.!