Konda Movie Review : ‘కొండా’ సినిమా ఎలా ఉందంటే…

Konda Movie Review

Konda Movie Review : ‘కొండా’ సినిమా ఎలా ఉందంటే…

చిత్రం : కొండా

దర్శకత్వం : రామ్‌గోపాల్‌వర్మ

రేటింగ్ : 2.75/5

విడుదల తేది: 23, జూన్ 2022

నటీనటులు : త్రిగుణ్, ఇర్రామోర్, తులసి, యల్బీ శ్రీరామ్, రామ్ ప్రసాద్, పృధ్విరాజ్, శ్రవణ్, అభిలాష్ చౌదరి, ప్రశాంత్ కార్తీ తదితరులు

సంగీతం : డియస్సార్ బాలాజీ

సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్

నిర్మాణం: ఏపిల్‌ట్రీ ప్రొడక్షన్స్, రామ్ గోపాల్ వర్మ కంపెనీ

నిర్మాత : సుస్మితా పటేల్

బయోపిక్స్ తీయడంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట అని అందరికీ తెలిసిందే! వెండితెరపై వివాదాత్మక చిత్రాలతోనే తనకంటూ ఓ ముద్రవేసుకొన్నఘనుడాయన. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్యా రాజకీయాల్ని, రాజకీయ హత్యల్ని తెరపై చూపించడానికి వర్మ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాడు. ‘రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ యన్టీఆర్’ లాంటి చిత్రాలు అలాంటి కోవకు చెందినవే కావడం గమనార్హం. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన మరో బయోగ్రాఫికల్ సినిమా ‘కొండా’. తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన వరంగల్ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన, ఇంకా పోషిస్తోన్న కొండా మురళి, కొండా సురేఖల జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. విడుదలకు ముందే వచ్చిన టీజర్, ట్రైలర్స్‌ మంచి బజ్ నిక్రియేట్ చేశాయి. మరి నేడు (జూన్ 23,2022)న విడుదలయిన ఈ చిత్రం ఏమేరకు అంచనాల్ని అందుకుంది? ప్రేక్షకులకు చిత్రం ఏ స్థాయిలో కనెక్ట్ అయింది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…

కథ:

తెలంగాణ నేపథ్యంలో కథ సాగుతుంది. అన్యాయం ఎక్కడ కనిపించినా సహించలేని తత్వంతో ఆవేశంతో కొట్లాటలకు దిగుతుంటాడు కొండా మురళి (త్రిగుణ్) అది తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది. ఆ కారణంగా అతడ్ని వరంగల్ లో ఒక కాలేజ్ లో జాయిన్ చేస్తారు. అక్కడ కూడా మురళి రెబల్‌గా ఉంటాడు. అదే కాలేజ్ లో చదువుతూ విప్లవభావాలు కలిగిన ఆర్కే కవితలకు ఆకర్షితుడై.. అతడి బృందంలో చేరతాడు. కాలేజ్ మేట్ సురేఖతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు కూడా అతడిపై ఇష్టం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్ళిచేసుకుంటారు. రాజకీయ నాయకుడు నల్లసుధాకర్ (పృధ్విరాజ్) కొండాను ఉపయోగించుకొని తన పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. ముందుగా అతడితో చేతులు కలిపిన మురళి.. అతడి నిజస్వరూపం తెలుసుకొని అతడ్ని దూరం పెడతాడు. దాంతో కక్ష కట్టిన నల్ల సుధాకర్ .. అతడిపై అటాక్ చేయిస్తాడు. చావునుంచి తప్పించుకొని బైటపడ్డ అతడ్ని తిరిగి చంపించాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తాడు. ఆ క్రమంలో మురళికి అండగా నిలిచిన నక్సల్స్ నాయకుడు ఆర్కేని, భారతక్కని ఎన్ కౌంటర్ చేయిస్తాడు. దాంతో ఆవేశంతో రగిలిపోయిన మురళి.. చివరికి నల్లసుధాకర్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? రాజకీయ పరంగా అతడు ఎలా ఎదిగాడు? నక్సలైట్ ఉద్యమంతో కొండా మురళికి అనుబంధం ఏమిటి? నల్ల సుధాకర్‌తో విబేధాలు ఎందుకు ఏర్పడ్డాయి? తనపై హత్యా ప్రయత్నం చేసిన నల్ల సుధాకర్, పోలీసులను కొండా మురళి ఎలా ఎదురించాడు? తన రాజకీయ ప్రస్థానంలో కొండా సురేఖ అండగా ఉన్న తీరు.. రాజకీయ ప్రత్యర్థులపై ఆమె ఎలాంటి వ్యూహాలు అనుసరించింది అనే ప్రశ్నలకు సమాధానమే కొండా చిత్రం.

విశ్లేషణ:

కొండా చిత్రాన్ని తీయడానికి ముందు వర్మ.. కొండా దంపతులతో చర్చించి, వారిచ్చిన ఇన్ పుట్స్‌తో, తనకున్న పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకి కొత్తగా నక్సల్స్ యాంగిల్ కూడా వచ్చి చేరింది. ఈ యాంగిల్ వర్మకి కొత్త. అయినప్పటికీ తనదైన శైలిలో సాధ్యమైనంత వరకూ వాస్తవికతను తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. కొండా మురళి పాత్రను హీరోగా చూపించడానికే ఎక్కువ తాపత్రయ పడ్డాడు. అలాగే.. ఆయన భార్య సురేఖ పాత్రను కూడా పవర్ ఫుల్ గా ఆవిష్కరించడానికి చూశాడు. ఉత్తర తెలంగాణలో తిరుగులేని రాజకీయ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కొండా. అత్యంత వివాదాస్పదమైన సంఘటనలు, సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ కథను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరక్కించారు. అయితే అతి సాధారణ జీవితం నుంచి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్స్ కొండా దంపతుల జీవితం వెండితెర మీద కూడా అదే స్థాయిలో కనిపించింది. కొండా బయోపిక్ విషయానికి వస్తే.. తొలి భాగమంతా అధిక భాగం వాస్తవాలకు దూరంగా ఫిక్షన్, గ్లామర్ అంశాలకు పెద్ద పీట వేశారనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఏదో జరుగుతుందనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక కొండా సెకండాఫ్‌ విషయానికి వస్తే.. డ్రామా, ఫ్యాక్షన్ అంశాలు, కొండా మురళి రెబెల్‌గా మారే అంశాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అయితే కీలక పాత్రలను పేరు, ఊరు లేని నటుల చేత చేయించడంతో ఆ పాత్రలు తెర మీద ప్రభావం చూపలేకోయాయని అనిపిస్తుంది. భారీ భావోద్వేగాలకు, అనేక ట్విస్టులతో కూడిన కొండా మురళి, సురేఖ జీవితాలు బయోపిక్‌కు పక్కా సూట్ అవుతాయి. అయితే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి బయోపిక్‌ తీయడానికి బదులు బయోఫిక్షన్ తీయడానికే మొగ్గు చూపారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే…

ఈ కథలో హీరో త్రిగుణ్, ఇర్రామోర్ తమ పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు. కొండా మురళీగా త్రిగుణ్ అదరగొట్టాడు. అతడికి నటనమీద మంచి అనుభవం ఉండడంతో టైటిల్ రోల్‌ను సమర్ధవంతంగా పోషించాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్, సాఫ్ట్ హీరోగా కనిపించిన త్రిగుణ్ రెబెల్‌గా ఆకట్టుకొంటాడు. ఇక సురేఖ గా కొత్తమ్మాయి ఇర్రామోర్ సహజంగా నటించి మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా అనిపిస్తుంది. భావోద్వేగమైన పాత్రలో ఒదిగిపోయింది. ఇక మెయిన్ విలన్ గా పృధ్విరాజ్ అద్భుతంగా నటించాడు. కమెడియన్ రామ్ ప్రసాద్ నెగెటివ్ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది. మురళి తల్లిదండ్రులుగా తులసి, యల్బీ శ్రీరామ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నక్సలైట్ నాయకుడు ఆర్కే గా ప్రశాంత్ కార్తి ఆ పాత్రలో ఒదిగిపోయాడు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమా బాగానే ఉందనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగా తీశాడు వర్మ. కొండా మురళీ మీద అటాక్ చేసే సీన్, ఒక భూస్వామిని చంపే సీన్, తనని చంపాలని చూసిన వారిని చంపించే సీన్, నల్ల సుధాకర్ ఇంటికొచ్చి అతడికి వార్నింగిచ్చే సన్నివేశం ఆసక్తికరంగా ఉంటాయి. మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫీ సూపర్. డీఎస్ఆర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు ఒకే. మొత్తం మీద సినిమా బయోగ్రఫీ పరంగా చూస్తే ఓకే అనిపిస్తుంది. ఓ సారి చూసేయొచ్చు!!

-ఎం.డి అబ్దుల్