పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నది.. రేవంత్ రెడ్డి చాలా చిన్న పిల్లోడు.. అంటూ తేల్చి పారేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని కలిసి, నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించారట.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్ష పదవి తనకు చాలా చిన్నదని సెలవిచ్చారు. మరి, ఆ పదవి దక్కలేదని ఎందుకు అలకపాన్పు ఎక్కినట్లో.? ఆ చిన్న పదవి కోసం ఢిల్లీలో మకాం వేసి కిందా మీదా పడిందెందుకో.? నిజానికి, ఈ తరహా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తరచూ వినిపిస్తుంటాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కూడా ఇలానే చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవి తనకు చాలా చిన్నదని పదే పదే సెలవిస్తుంటారాయన. కానీ, ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓటమిని చవిచూశారు.
తెలంగాణలో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకే మెరుగైన అవకాశాలుంటాయి. కాంగ్రెస్ పార్టీకి, అంతర్గత శత్రువుల తాకిడి ఎక్కువ. అదే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రేవంత్ రెడ్డి విషయమై కోమటిరెడ్డి వెంకటరెడ్డికే కాదు, కాంగ్రెస్ పార్టీలో చాలామందికి అభ్యంతరాలున్నాయి.
నిజానికి, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం వింతగానే చెప్పుకోవాలేమో. కానీ, ఆయనిప్పుడు పీసీసీ అధ్యక్షుడు. తెలంగాణలో పార్టీ కోసం తనవంతు కష్టపడేందుకు ఆయనకు అవకాశం దక్కింది.
కాంగ్రెస్ పార్టీలో ఇతర ముఖ్య నేతలంతా రేవంత్ రెడ్డితో కలిస్తే, కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. లేకపోతే, ఇంకా నాశనమైపోతుంది. కానీ, కాంగ్రెస్ నేతలకు ఈ లాజిక్ అనవసరం. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇలాగే వుంటాయ్. అదే ఆ పార్టీకి పెను శాపం.