తమిళనాడులో త్వరలో జరగునున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి హీటెక్కుతుంది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ శనివారం… సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెన్నైలోని రజనీ నివాసంలో ఆయనను కలిసి చాలాసేపు మాట్లాడటంతో అభిమానులలోనూ, ప్రజలలోనూ ఈ విషయం మీదనే విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయ ప్రవేశంపై నిర్ణయం మార్చుకున్నట్టు ఇటీవల రజనీ కాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేసేందుకు ఆయనను కలుసుకోనున్నట్టు అంతకుముందు కమల్ హాసన్ పేర్కొన్నారు. కమల్‌హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీతో కమల్‌కు ఒప్పందం జరిగిందని.. ఇక రజనీకాంత్ మద్దతు ఇస్తే రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు కావొచ్చని కమల్ హాసన్ భావిస్తున్నారు.
ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు ఇటీవల జైలు నుంచి వచ్చిన శశికళ రావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా రజనీ, కమల్ భేటితో మరింత ఉత్కంఠగా మారాయి. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి రజనీకాంత్ మద్దతు ఉంటుందనే ఊహాగానాల మధ్య తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే.. ఇది మర్యాదపూర్వక సమావేశమని, రాజకీయ పరమైనది కాదని కమల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.