బాలచందర్ శిష్యులుగా తమిళ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్. వీరిలో రజనీకాంత్ మాస్ హీరో కాగా, కమల్ హాసన్ ఆస్కార్ స్థాయి నటుడు. వీరిద్దరు కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులని అలరించారు. ఇక సినిమాలతో వినోదాన్ని పంచిన వీరిద్దరు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించారు. ఇందుకు గాను పార్టీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మండ్రం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి దిగారు. రజనీకాంత్ డిసెంబర్ 31,2020న పార్టీ ప్రకటన చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడంతో రాజకీయాలలోకి వచ్చేందుకు కాస్త వెనుకడుగు వేశాడు.
హైబీపీ వలన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కొద్ది రోజుల ట్రీట్మెంట్ తర్వాత చెన్నై వెళ్ళారు . అక్కడకు వెళ్ళాక ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు అఫీషియల్ ప్రకటన చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులు డిప్రెస్ అయ్యారు. ఇక కమల్ హాసన్ రానున్న ఎన్నికలలో సత్తా చూపాలని భావిస్తున్న క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ యేడాది ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుతో 234 సీట్లలో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో కమల్ కొన్నాళ్ళు ఇంటికి పరిమితం కావలసి రావడం ఆందోళన కలిగిస్తుంది.
కొద్ది రోజుల పాటు సినిమాలు, రాజకీయాలకు తాను బ్రేక్ తీసుకుంటున్నట్టు కమల్ స్పష్టం చేశారు. శభాష్ నాయుడు షూటింగ్ సందర్భంగా కమల్ హాసన్ యాక్సిడెంట్‌కు గురయ్యారు. అప్పట్లో కమల్ కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. వైద్యులు విశ్రాంతి తీసుకోమన్నా కూడా అవేమి పట్టించుకోకుండా సినిమాలు, రాజకీయాలు అంటూ బిజీగా కాలం గడుపుతున్నారు కమల్. ఇప్పుడు గాయం తిరగబెట్టడంతో మరోసారి శస్త్ర చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారు కమల్. ఏప్రిల్ వరకు తాను కోలుకుంటానని చెబుతున్న కమల్ ఆ తర్వాత సినిమా షూటింగ్స్ కూడా చేయనున్నాడు.