Muraari Movie: మురారి సినిమాకు నాకు నంది ఇవ్వాల్సింది.. కానీ ఇవ్వలేదు.. సినిమాటోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్!

Muraari Movie: తనకు, కృష్ణ వంశీకి మురారి సినిమా తర్వాత గ్యాప్ వచ్చిందని డీఓపీ రాంప్రసాద్అన్నారు. ఆ తర్వాత చక్రం, మున్నా, శ్రీ ఆంజనేయం లాంటి సినిమాలు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో అలా అవుతుంది అంతే గానీ ప్రత్యేకమైన కారణమేమీ లేదని ఆయన అన్నారు. కృష్ణ వంశీతో చేసిన సినిమాలన్నీ దాదాపు నందీ అవార్డు వచ్చే విధంగానే ఉంటాయని ఆయన అన్నారు.

అయితే తనకు మున్నా సినిమాకు గానూ నంది అవార్డు వచ్చిందని రామ్ ప్రసాద్ తెలిపారు. ఆ సినిమాకు నందీ అవార్డు రావడం అనేది తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కానీ మురారీ సినిమాకు రాలేదని మాత్రం తాను చాలా బాధ పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం డైరెక్టర్ కృష్ణ వంశీకి చెప్పానని, ఆయన దానికి ఆడియన్స్ అంగీకరించారు కదా.. అదే నీకు పెద్ద అవార్డు అని ఆయన అన్నట్టు రామ్ ప్రసాద్ చెప్పారు. అవార్డు అనేది ఎవరికైనా ఒక ఎంకరేజ్‌మెంట్ లాంటిదని, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌ ఉంటుంది కదా అని ఆయన అన్నారు. నిజంగా ఆ సంవత్సరం ఆ సినిమా కంటే బెటర్‌గా వచ్చిన సినిమాకే ఇచ్చారేమో గానీ, తనకు మాత్రం ఆ సినిమా వస్తే బాగుండేదేమో అని భావించినట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఎవరైనా పిలిస్తే చిన్న సినిమాలు కూడా చేయడమనేది సాధారణమైనదేనని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం సెలక్టివ్‌గా వెళుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మెయిన్ బడ్జెట్, ప్రొడక్షన్‌ హౌస్ ఇలా అన్నీ చూసుకొని ఎంపిక చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. ఇప్పడు మాత్రం ఇంతకు ముందులా చిన్న సినిమాలు చేయలేమని ఆయన వివరించారు.