Major : ‘మేజర్’ ఫస్ట్ సింగిల్ విడుదల!

Major : అడివి శేష్ బహుభాషా వార్ మూవీ ‘మేజర్’ ఫిబ్రవరి 11 న థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మొదటి సింగిల్ ‘హృదయమే’ సాంగ్ శుక్రవారం ఉదయం విడుదల చేస్తూ మ్యూజిక్ ప్రమోషన్లు ప్రారంభించారు. తెలుగు వెర్షన్ సాంగ్ ని ప్రిన్స్ మహేబ్ బాబు విడుదల చేయగా, మలయాళం వెర్షన్ ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల రూపొందించిన ఈ సాంగ్ మెలోడీ ప్రధానంగా ప్రేమికుడి హృదయ గానాన్ని పలికిస్తోంది.

సున్నిత పదాలతో కూడిన ఈ సాంగ్ ని సీడ్ శ్రీరామ్ మధురంగా ఆలపించాడు. ఈ సాంగ్ విజువల్స్ హీరో అడివి శేష్, హీరోయిన్ సాయి మంజ్రేకర్ ల మధ్య అందమైన ప్రేమకథతో చూడ దగ్గవిగా వున్నాయి. అడవి శేష్ యుద్ధ రంగంలో వుండగా, అతడికోసం సాయి మంజ్రేకర్ ఎదురు చూపులు చూస్తున్నట్టు దృశ్యాలున్నాయి. ప్రేమికుల మధ్య దూరాల్ని ఈ పాట విరహ వేదనతో వ్యక్త పరుస్తోంది…

2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ ని రూపొందించారు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.