కల్యాణ్ రామ్ ‘బింబిసార’ కలెక్షన్ల ప్రవాహం ఎలా ఉందంటే..?

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నవతరం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘బింబిసార’ కలెక్షన్ల ప్రవాహం సునామీ సృష్టించేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ విజయపథంలో పరుగులు పెడుతోంది. అంతేకాదు.. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ రికార్డు.నాలుగోరోజైన సోమవారం కూడా ‘బింబిసార’ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రాలు అరుదు. అలాంటి రికార్డును ‘బింబిసార’ చిత్రం సాధించింది. అని స్వయంగా ‘బింబిసార’ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు చెప్పడం గమనార్హం. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు నేను సినిమా చూశాను. సినిమా చూసినప్పుడే గట్టిగా కొడుతుందని అనుకొన్నాను. కానీ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందనే విషయంపై అంచనా వేయలేకపోయాను. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదని అన్నారు. ‘బింబిసార’ తొలి రోజు 7.27 కోట్లు, రెండో రోజు 5.10 కోట్లు, మూడో రోజు 5.92 కోట్లు సాధించిన ఈ చిత్రం నాలుగో రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. మూడు రోజుల్లో 18.29 కోట్ల షేర్, 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అయితే బింబిసారకు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి రోజు రోజుకు వసూళ్ల వేగం పెరుగుతున్నది. సోమవారం రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల షేర్, దేశవ్యాప్తంగా 2.6 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బింబిసార సినిమా విడుదలకు ముందు 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. గత మూడు రోజుల్లోనే ఈ చిత్రం 18.29 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం 2 కోట్లకుపైగా లాభాన్ని నమోదు చేసింది. అమెరికాలో సైతం ‘బింబిసార’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 350K డాలర్లను గ్రాస్ వసూళ్లను సాధించింది. వారాంతం వరకు ఈ చిత్రం 500K డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో కూడా భారీగా కలెక్షన్లను సాధిస్తుండటం విశేషంగా మారిందంటున్నారు.