మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలానే కష్టపడ్డాడు. ఇంకా పడుతూనే ఉన్నాడు. విదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకుని వచ్చాడు. మధ్యలో గాయాలు కూడ ఆయన్ను ఇబ్బంది పెట్టాయి. అయినా వరుణ్ కమిట్మెంట్ వదల్లేదు. ఏ సినిమాకూ ఇవ్వనన్ని డేట్స్ ఈ చిత్రానికి కేటాయించాడు వరుణ్. మొదటి నుండి ఈ సినిమాను సాదాసీదాగా కాకుండా గొప్పగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు టీమ్.
నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ఇద్దరూ ఖర్చుకు వెనుకాడట్లేదు. స్పెషల్ సెట్స్, టాప్ టెక్నీషియన్స్ కోసం కోట్లు కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఫారిన్ నుండి స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకొస్తున్నారు. సినిమాలో భారీ స్టేడియం నేపథ్యంలో బాక్సింగ్ ఫైట్స్ ఉంటాయట. వీటీని కంపోజ్ చేయడం కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు లార్నెల్ స్టోవల్, వాడ్ రింబుర్ ను తీసుకొస్తున్నారు. వీరు గతంలో సల్మాన్ ఖాన్ సినిమాకు కూడ పనిచేశారు. వీరు కంపోజ్ చేయబోయే బాక్సింగ్ సన్నివేశాలతో సినిమా మరింత గొప్పగా తయారవుతుందని తెలుస్తోంది.