Sankranthi : సమరానికి దిగిన వారసులు!

Sankranthi : ఈ సంక్రాంతికి ముగ్గురు వారస హీరోలు సందడి చేయడానికి విచ్చేస్తున్నారు. ముగ్గురూ కింగ్ నాగార్జునతో పోటీ పడుతున్నారు. కింగ్ నాగార్జున కూడా కుమారుడు నాగ చైతన్యతో కలిసి విచ్చేస్తున్నారు. వీరిద్దరి ‘బంగార్రాజు’ తో ముగ్గురు సినీ ప్రముఖల వారసులు పోటీ పడడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాలతో సంక్రాంతి వాతావరణం కళకళ లాడుతోంది.

కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ‘ఆర్ ఆర్ ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘సర్కారు వారి పాట’, ‘ఆచార్య’ మరికొన్ని ఇతర సినిమాలని వాయిదా వేయడంతో, టాలీవుడ్ బాక్సాఫీస్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అనేక చిన్న, మధ్య స్థాయి సినిమాలు సిద్ధమయ్యాయి ఈ సంక్రాంతికి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రముఖ కుటుంబాలకు చెందిన కొత్త హీరోలు ఈ సినిమాలతో రంగ ప్రవేశం చేయడం.

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రస్తుత గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు – అశోక్ గల్లా ‘హీరో’తో టాలీవుడ్‌లో రంగప్రవేశం చేస్తున్నాడు. జనవరి 15న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ‘హీరో’ ట్రైలర్‌ ని ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల విడుదల చేశారు. ఇది ఫాంటసీ ఎంటర్ టైనర్ గా వుంటుంది.

ప్రసిద్ధ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఇది కాలేజీ స్టూడెంట్స్ తో రోమాంటిక్ యాక్షన్ గా వుంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘సూపర్ మచ్చి’ జనవరి 14 న విడుదలవుతోంది.

నాగ చైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ ‘బంగార్రాజు’తో వస్తున్నాడు, ఇది జనవరి 14 న విడుదలవుతోంది. ఇది అతీంద్రియ డ్రామాగా వుంటుందని తెలుస్తోంది. వీరందరికీ ఈ నాల్గు సినిమాలూ ముఖ్యమే. అయితే వారస హీరోలు కింగ్ నాగ్- చైతూ కాంబోతో పోటీపడుతూనే మరోవైపు తోటి వారస హీరోలతో పోటీ పడే పరీక్షని ఎదుర్కొక తప్పని పరిస్థితి. వీరి ఏ సినిమాకా ఆ సినిమా సోలో రిజీజ్ గా వచ్చి వుంటే వీరి పెర్ఫార్మెన్స్, సక్సెస్ ఏమిటో తెలిసేది. పరస్పర పోటీ అనేది అప్పుడే ఆరోగ్యదాయకం కాదు. కానీ పరిస్థితి అలా వుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత రిలీజ్ ఛేసే పరిస్థితి ఇంకెప్పుడుంటుందో తెలియక పోవడం వల్ల.