పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కూడ ఉంది. దీని మీద ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ‘గబ్బర్ సింగ్’ ఫీట్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ సినిమా మీద ఇప్పటికే అనేక వార్తలు పుకార్లు చేస్తున్నాయి. చిత్రంలో ‘మాస్టర్, ఠాగూర్’ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక తాజాగా ఇందులో పవన్ ద్విపాత్రాభినయం చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. పవన్ డ్యూయల్ రోల్ అనేది వినడానికి బాగానే ఉన్నా ఆచారంలో మాత్రం కొద్దిగా ప్రమాదకరమైన ప్రయోగమే అనాలి.
పవన్ అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంది. ఆయన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ కు ఒక స్కెల్ ఉంది. అన్ని సినిమాల్లోనూ అదే నడుస్తుంది. సినిమాలను హిట్ అయ్యేలా చేసేది కూడ అదే. అలాంటిది పవన్ ద్విపాత్రాభినయం అంటే ఒక పాత్రలో పాత పీకే కనబడినా ఇంకొక పాత్రలో కొత్త పీకే కనబడాలి. కొత్త పవన్ అంటే అసలు ఎలా ఉంటాడు, అతని యాటిట్యూడ్ ఏంటి అనేవి పెద్ద ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ లోని పాత మేనరిజం, స్టైల్ ఆఫ్ యాక్షన్ పక్కకు తీసేసి వేరో కొత్త వ్యక్తిత్వాన్ని, గుణాన్ని, మేనరిజాన్ని ఆయనలో ఇంజెక్ట్ చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకోవడం చాలా కష్టం.
‘తీన్మార్’ విషయంలో ఇదే జరిగింది. అందులో పవన్ డ్యూయల్ రోల్. వాటిలో అర్జున్ పాల్వాయ్ పాత్ర అందరికీ నచ్చింది కానీ మైకెల్ వేళాయుధం మిస్ ఫైర్ అయింది. పవన్ తత్వానికి పూర్తి విరుద్దంగా ఉంటుంది ఆ పాత్ర. అందుకే ఫ్యాన్స్ తిప్పికొట్టారు.. సినిమా డిజాస్టర్ అయింది. కాబట్టి హరీష్ శంకర్ పవన్ మీద డ్యూయల్ రోల్ అని కొత్త పవన్ అని ప్రయోగం చేస్తే మాత్రం అది మిస్ ఫైర్ అయ్యే ఛాన్సులే ఎక్కువ.