TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు చేసిన మంచి ఏంటి అలాగే కేంద్రంలో ఉన్న బిజెపి కూడా తెలంగాణకు ఏం చేసింది, ఇక 12 నెలల కాలంలో మా ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది అనే విషయాల గురించి వారితో చర్చించడానికి నేను సిద్ధమే అంటూ సవాల్ విసిరారు.
ఇలా మా ప్రభుత్వ హయామంలో ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని అభివృద్ధి పన్నెండు నెలల కాలంలో తెలంగాణలో జరిగిందని ఈ విషయంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఇలా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి చెప్పిన చోటుకు, చెప్పిన సమయానికి వస్తానన్నారు. కొడంగల్ అయినా.. రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా చర్చకు సిద్ధమన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలతోపాటు అన్ని అంశాలపైనా చర్చ చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు. నిందలు వేయడం మాని నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని ముఖ్యమంత్రికి హరీష్ రావు సూచనలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు అట్ట కెక్కడానికి కారణం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఈయన మండిపడ్డారు.
పాలమూరును ఎడారిగా మార్చిన తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో అంటకాగి తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు విమర్శించారు. 14 నెలల్లో ఒక్క చెక్ డ్యాం కూడా కట్టని వారు కేసీఆర్ గురించి ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కెసిఆర్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ స్పందిస్తూ చర్చలకు తాము సిద్ధమేనని తెలిపారు.