దళిత యువతి రమ్య హత్య: జగన్ ప్రభుత్వ వైఫల్యమేనా.?

గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. దళిత యువతి రమ్యని ఓ యువకుడు అత్యంత కిరాతకంగా చంపేశాడు. అదీ నడి రోడ్డు మీద.. అందునా, అందరూ చూస్తుండగానే. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఓ వైపు, అత్యంత కిరాతకమైన హత్య ఇంకో వైపు.. వెరసి, మనం స్వతంత్ర భారతావనిలోనే వున్నామా.? అన్న అనుమానం చాలామందికి కలిగింది. హత్యలు చేయడానికి నేరస్తులకు స్వాతంత్ర్యం వచ్చినట్లుంది పరిస్థితి. లేకపోతే, పట్ట పగలు.. అందరూ చూస్తుండగా ఇంతటి దారుణ హత్యా.? ఇంతకీ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది.? వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోన్న ‘దిశ’ ఏం చేస్తోంది.? దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, పోలీసు అధికారుల్ని ప్రత్యేకంగా చూపిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ, అవేవీ దళిత యువతి రమ్యను కాపాడలేకపోయాయి. వైఫల్యం ఎక్కడుంది.? ఓ నిండు ప్రాణం బలైపోయింది. 10 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇస్తామంటోంది.

పది కోట్లు ఇచ్చినా, రమ్యను బతికించలేరు కదా.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్నాయంటే, ఖచ్చితంగా ఎక్కడో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మహిల హోంమంత్రిగా వున్న రాష్ట్రంలో.. అందునా, ముఖ్యమంత్రి అలాగే హోం మంత్రి నివాసముంటోన్న గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనలెందుకు జరుగుతున్నాయి.? ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి కూత వేటు దూరంలో వున్న కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ‘దిశ’ యాప్ మీద విపరీతమైన ప్రచారం చేశారు ప్రభుత్వ పెద్దలు. ఏమైంది ఆ దిశ.? అన్న ప్రశ్న చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది. ఘటనలు జరిగినప్పుడు, ఆయా ఘటనల్లో నిందితుల్ని వేగంగా పట్టుకోవడమే కాదు, వారికి వేగంగా శిక్షలు పడేలా పోలీసు వ్యవస్థ పనిచేయాల్సి వుంటుంది. ప్రచార ఆర్భాటం తప్ప, పని తీరు అత్యంత బాధాకరం.. అంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్న వేళ, ఈ ఘటన విషయంలో జగన్ సర్కారు.. ఎలా తమపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తుందో వేచి చూడాలి.