గరికపాటి అహంకారం.! మెగాస్టార్ చిరంజీవి సంస్కారం.!

మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రవచనకర్తగా పేరొందిన గరికపాటి నరసింహారావు సంస్కారాన్ని, సభా మర్యాదనీ విస్మరించి, అహంకారాన్ని ప్రదర్శించారు.

మాజీ కేంద్ర మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఈ అనుకోని సంఘటన జరిగింది. అనుకోని సంఘటన అనొచ్చా.? చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిసి, ముందే పక్కా వ్యూహంతో గరికపాటి తన కుట్రని అమలు చేశారని భావించాలా.?

చిరంజీవి ఎక్కడికైనా వెళితే, అక్కడ ఆయన చుట్టూ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఒక్కోసారి వేలు, లక్షల సంఖ్యలో జనం గుమికూడటం, ఆయన మీదకు ఎగబడటం మామూలే. అది గరికపాటికీ తెలుసు. తాను ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవి ఫొటో సెషన్‌తో బిజీగా వున్నారన్నది గరికపాటి ఆరోపణ.

నిజానికి అది చిరంజీవి ఫొటో సెషన్ కాదు.. చిరంజీవితో ఫొటోల కోసం అభిమానులు ఎగబడ్డ వైనం. అక్కడే హర్యానా గవర్నర్, సభా నిర్వాహకుడు బండారు దత్తాత్రేయ.. ఆ చిరంజీవి వెంటే వున్నారు. గరికపాటి ప్రశ్నించదలచుకుంటే ఎవర్ని ప్రశ్నించాలి.. సభను ఏర్పాటు చేసినవాళ్ళని. అది కూడా, వారిని దగ్గరకు పిలిచి.. లేదా తాను వాళ్ళదగ్గరకు వెళ్ళి చెప్పాలనుకున్నది చెప్పాలి.

ఇష్టం లేకపోతే, నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ, చిరంజీవిగారూ మీరు పొటో సెషన్ ఆపేసి రావాలి.. లేకపోతే, నేను వెళ్ళిపోతాను.. అని అనడమేంటి.? చిరంజీవి కోసం గరికపాటి వచ్చారా.? గరికపాటి కోసం చిరంజీవి వచ్చారా.? పండిత పుత్ర.. పరమ శుంఠ.. అని వింటుంటాం. కానీ, ఇక్కడ పండితుడే పరమ శుంఠలా వ్యవహరించిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

చిరంజీవి హుందాగానే వ్యవహరించారు.. మాట తూలలేదు. అదే మాట చిరంజీవి కూడా అనగలరు. ‘నన్ను ఆపమనడానికి నువ్వెవడివిరా.? అయినా నాకేం సంబంధం.? ఆ మాట నాతో ఫొటోలు దిగడానికి వచ్చినవాళ్ళకి చెప్పు..’ అని చిరంజీవి నిలదీయొచ్చు. కానీ, ఆయనకు సంస్కారం అడ్డు వచ్చింది.