ఉరికంభం ఎక్కనున్న తొలి మహిళ .. ఇంతకీ ఏంచేసిందంటే ?

భారతదేశంలో తొలిసారిగా ఓ మహిళకు ఉరి శిక్ష అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఉరి శిక్ష అమలు చేయాలని మథుర కోర్టు ఆదేశించడంతో అందుకు తలారీ సిద్ధమౌతున్నాడు. ఇంకా డేట్ నిర్ణయించలేదు. అదే జరిగితే..దేశంలో ఉరికంభం ఎక్కిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోనుంది.

ఆమె ఉన్నత చదువులు చదివింది. డ్యుయల్ ఎంఏ చేసింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పింది. ఆమెను ఉరి తీయించడానికి మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. మీరట్‌కు చెందిన తలారి పవన్ జల్లద్ ఆ మహిళను ఉరి తీయడానికి సిద్ధమయ్యాడు. 2012లో ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులను ఉరి తీసిన తలారి ఆయనే. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ మహిళ పేరు షబ్నమ్. ఈమె ఒకేసారి ఏడుగురిని హత్య చేసింది. చంపేసిన వారంతా..ఆమె కుటుంబసభ్యులే కావడం గమనార్హం. అందులో అభం..శుభం తెలియని చిన్నారి కూడా ఉంది.

షబ్నమ్ ఇంటి పక్కనే ఓ కట్టె కోత మెషీన్ ఉండేది. అందులో సలీమ్ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేసేవాడు. ఆమెకు అతడితో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే అది శారీరక సంబంధానికి దారితీసింది. విషయం షబ్నమ్ ఇంట్లో తెలియడంతో కుటుంబసభ్యులు మందలించారు. ఆ యువకుడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దని హెచ్చరించారు.

కానీ, షబ్నమ్ పూర్తి విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. సలీంను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. కట్టె కోత కర్మాగారంలో కూలీగా పనిచేసేవాడికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఆమెను ఈసారి గట్టిగా మందలించారు. ఎదురుతిరగడంతో గదిలో పెట్టి బంధించారు.ప్రియుడిని కలవకుండా చేశారనే కోపంతో షబ్నమ్ తన కుటుంబసభ్యులపై కోపం పెంచుకుంది. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది. వారి అడ్డు తొలగించుకోవాలనుకుంది. తాను మారినట్టు కుటుంబసభ్యులను నమ్మించింది. రహస్యంగా ప్రియుడిని కలిసి తన ప్రణాళిక వివరించింది.

అది 2008 ఏప్రిల్ 14 అర్ధరాత్రి. షబ్నమ్ కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. భూకంపం వచ్చినా నిద్ర లేచే పరిస్థితిలో లేరు. ఎందుకంటే షబ్నమ్ ముందస్తు ప్రణాళిక ప్రకారం.. కుటుంబసభ్యులు రాత్రి భోజనం తర్వాత తాగే పాలలో మత్తు మందు కలిపింది. వాళ్లు మత్తులోకి జారుకున్న తర్వాత తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. సలీంతో కలిసి వారందరినీ గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేయించింది. షబ్నమ్ తన మేనల్లుడైన చిన్నారిని కూడా విడిచిపెట్టలేదు.

హత్య జరిగిన 5 రోజుల తర్వాత షబ్నమ్‌ను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోగ్య పరీక్షలు చేయించగా షబ్నమ్ అప్పటికే ఏడు వారాల గర్భవతి అని తేలింది. పోలీసులు వారిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 2008లో డిసెంబర్‌లో షబ్నమ్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భారత్‌లో మహిళలను ఉరి తీయడానికి ఏర్పాట్లు ఉన్న ఏకైక ప్రదేశం ‘మథుర జైలు’. దీన్ని 150 ఏళ్ల కిందట నిర్మించారు. బ్రిటిషర్ల పాలనా కాలంలో 1870లో ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం అక్కడ ఓ మహిళకు ఉరిశిక్షను కూడా అమలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 150 ఏళ్ల నాటి ఈ జైల్లో ఇప్పుడు మరో మహిళను ఉరికంభం ఎక్కించడానికి రంగం సిద్ధమైంది.