అనిల్ రావిపూడి.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంటర్టైన్మెంట్ రాయడంలో దిట్ట అనిపించుకున్నారు. మొదటి సినిమా నుండి వరుస విజయాలను అందుకుంటూనే ఉన్నారు. ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు’ ఇలా అన్నీ హిట్ సినిమాలే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. మహేష్ బాబుతో సినిమా చేసి పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయారు. అలా దేదీప్యమానంగా సాగిపోతున్న ఆయన మొట్టమొదటిసారి పరాజయాన్ని చవిచూశారు. ఆయన నిర్మాతగా చేసిన మొదటి సినిమా ‘గాలి సంపత్’. గట్టి పోటీ నడుమ సినిమా శివరాత్రి రోజు రిలీజ్ అయింది.
‘జాతిరత్నాలు’ హిట్ టాక్ తెచ్చుకోగా ‘శ్రీకారం’ పర్వాలేదనిపించుకుంది. ‘గాలి సంపత్’ మాత్రమే ఢీలా పడింది. వసూళ్ళ విషయంలోనే అంతే మిగతా రెండు సినిమాలు పోటాపోటీగా ఉండగా ‘గాలి సంపత్’ పూర్తిగా వెనుకబడిపోయింది. సినిమాను సుమారు 6.5 కోట్లకు అమ్మారట. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. కానీ తొలిరోజు వచ్చింది అరకోటి మాత్రమే. రెండవ రోజు అది ఇంకాస్త తగ్గింది. వీకెండ్ అయినప్పటికీ పుంజుకోలేకపోతోంది. ట్రేడ్ వర్గాల అంచనా మేరకు సినిమా నష్టాలతోనే ముగుస్తుందని తెలుస్తోంది. ఇలా దర్శకుడిగా ఒక వెలుగు వెలుగుతున్న అనిల్ రావిపూడి నిర్మాతగా మాత్రం మొదటి ప్రయత్నంలోనే చేతులు కాల్చుకున్నారు.