డిసెంబర్ 8 న భారత్ బంద్ !

రైతు సంఘాలు కేంద్రం పై మరింత ఒత్తిడి తీసుకువచ్చేలా తమ ప్రణాళికల్ని వేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే కేంద్రం జరుపుతున్న చర్చలు సఫలం కాకపోవడంతో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

శుక్రవారం 35 రైతు సంఘాల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కేంద్రంతో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు, మోదీ ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చలు జరిపారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లాఖోవాల్‌ ప్రకటించారు. ఇక నేడు మోడీ ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు.

మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్‌ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లాహ్‌ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్‌ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని అన్నారు. మరోవైపు, దేశరాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలను మిన్నంటాయి. సింఘూ, టిక్రీ, గాజీపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై రైతులు నిరసనలు సాగిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ రాత్రంతా రోడ్లపైనే నిద్రిస్తున్నారు. అక్కడే వండుకొని ఆహారాన్ని తింటున్నారు. నిరసనల వల్ల పలు రహదారులను మూసివేశారు.