విజయ్ దేవరకొండ సైన్ చేసిన సినిమాల్లో సుకుమార్ చిత్రం కూడ ఒకటి. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ సంస్థకు ఇదే మొదటి చిత్రం. పైగా సుకుమార్ దర్శకత్వం. అందుకే భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. హెవీ బడ్జెట్ పెడుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా సుకుమార్, విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలు వెనక్కి వెళ్లడంతో ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ మొదలయ్యాయి. నిర్మాతలు కొన్నాళ్ళు వీటిపై స్పందించకపోవడంతో అందరూ నిజంగానే ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ నిర్మాతలు ఉన్నపళంగా క్లారిటీ ఇచ్చేశారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తమ తొలి చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే మొదలవుతుందని ప్రకటించారు. పనిగట్టుకుని కొందరు సినిమా మీద అసత్య ప్రచారం చేస్తున్నారని అలాంటివేం నమ్మవద్దని, ఎలాంటి మార్పులూ లేవని, ఉన్నదల్లా భారీ ప్లానింగ్ మాత్రమేనని అన్నారు. ఒక్కసారి సుకుమార్ ‘పుష్ప’ సినిమాను కంప్లీట్ చేస్తే ప్రీప్రొడక్షన్ పనులు మొదలవుతాయని, విజయ్ దేవరకొండ ‘లైగర్’ కంప్లీట్ అవ్వగానే షూటింగ్ మొదలవుతుందని నేరుగా చెప్పేశారు. మొత్తానికి నిర్మాతకు విజయ్ దేవరకొండ మాదిరిగానే చాలా దూకుడుగా తమ మీద ఫాల్స్ ప్రాపగండా చేస్తున్న వారికి సమాధానం ఇచ్చేశారు.