సినీ నటి సమంతకు కాస్త ఊరట దొరికింది న్యాయస్థానంలో. అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని ఇటీవల ‘విడాకులతో’ రద్దు చేసుకున్నాక, సమంతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. అత్యంత జుగుప్సాకరమైన కథనాలూ ఆమె మీద షురూ అయ్యాయి.
యూ ట్యూబ్‌లో అయితే మరీ దారుణంగా థంబ్ నెయిల్స్ పెట్టి.. సమంత పేరుపై దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు. ఈ వ్యవహారంపై సమంత కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. రెండు యూ ట్యూబ్ ఛానళ్ళతోపాటు, ఓ న్యాయవాదిపైనా ఆమె కోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం, సదరు యూ ట్యూబ్ చానల్స్ నుంచి వీడియోలు తొలగించాలని ఆదేశించింది. ఆ న్యాయవాది, సమంత విషయంపై మాట్లాడిన వీడియోలను తొలగించాలన్నది కోర్టు ఆదేశం తాలూకు సారాంశం.
మరోపక్క, సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రచారం చేయకూడదని కూడా న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. అదే సమయంలో, వ్యక్తిగత అంశాల్ని సమంత కూడా పోస్ట్ చేయొద్దని న్యాయస్థానం అల్టిమేటం జారీ చేసిందట.
సెలబ్రిటీలన్నాక.. వారికి సంబంధించిన అంశాలపై జనంలో ఆసక్తి ఎక్కువగానే వుంటుంది. ఈ క్రమంలో నెగెటివిటీ చాలా ఎక్కువ వుండడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. సమంత ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. వాటి సర్క్యులేషన్ ఆగిపోతుందా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.