Posani : పోసాని కృష్ణమురళి మంచి కమెడియన్. అయితే, అంతకన్నా ముందు ఆయన చాలా మంచి రచయిత. పోసాని రచనలో వచ్చిన సినిమాలకు అప్పట్లో చాలా క్రేజ్ వుండేది. పదునైన సంభాషణలు పోసాని రచన చేసిన సినిమాల్లో వుండేవి. కథ, స్క్రీన్ ప్లే విభాగాలపై పోసానికి మంచి పట్టుంది. అందుకే ఆయన దర్శకుడిగా కూడా మారాడు.
అయితే, రచయితగా సాధించిన పేరు ప్రఖ్యాతుల కంటే కూడా నటుడిగానే ఆయనకిప్పుడు స్టార్‌డమ్ వచ్చేసింది. స్టార్ కమెడియన్ అవడం వెనుక చాలా పెద్ద కారణమే వుందని చెబుతుంటాడు పోసాని. అదృష్టం తలుపు తట్టి తనను స్టార్ కమెడియన్‌ని చేసిందని పోసాని పలు సందర్భాల్లో చెప్పారు.
నిజానికి, పోసాని స్టార్ కమెడియన్ స్టేటస్ దక్కించుకున్నది ‘నాయక్’ సినిమా తర్వాతనే. అందులోని పోసాని పాత్ర అప్పటికీ ఇప్పటికీ సెన్సేషన్ అంతే.! వాస్తవానికి ఆ సినిమాలో పోసాని పాత్రలో తొలుత వేరే కమెడియన్‌ని అనుకున్నారట. చివరి నిమిషంలో ఆ కమెడియన్ హ్యాండివ్వడంతో దర్శకుడు వినాయక్ మరో కమెడియన్ కోసం వేట షురూ చేశారట.
హీరో రామ్ చరణ్.. ఈ విషయంలో బాగా ఆలోచించి, పోసాని కృష్ణమురళి పేరుని దర్శకుడికి రిఫర్ చేశారట. అలా పోసానికి ఆ సినిమాలో కీలకమైన కమెడియన్ అవకాశం దక్కిందని అంటారు.
అప్పట్లో పోసానికి, చిరంజీవి కుటుంబం అంటే బోల్డంత గౌరవం. రామ్ చరణ్ అంటే చిన్నప్పటినుంచీ పోసానికి తెలుసు. ఆ చనువుతోనే, ఆ అభిమానంతోనే పోసానికి అంత మంచి పాత్రని చరణ్ తన సినిమాలో ఇచ్చాడని అంటారు.