నిర్మాత దిల్ రాజు పంథా మార్చాడు. ఇన్నాళ్లు తెలుగులోనే భారీ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు ఇండియాలోనే ఖరీదైన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. వాటిలో ఒకటి శంకర్, రామ్ చరణ్ సినిమా రెండవది ప్రభాస్, ప్రశాంత్ నీల్ చిత్రం కాగా మూడవది విజయ్, వంశీ పైడిపల్లి చిత్రం. ఈ మూడు సినిమాల్లోనూ హీరోలకు దిల్ రాజు కళ్ళు చెదిరే పారితోషకం ఇస్తున్నాడట. తాజాగా వంశీ పైడిపల్లి సినిమాకి గాను విజయ్ కు దిల్ రాజు ముట్టజెబుతున్న లెక్కల మీద ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.
ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. తమిళం, తెలుగులో రూపొందుతూ ఇతర భాషల్లో కూడ రిలీజ్ కానుంది. బడ్జెట్ సుమారు 250 కోట్లకు పైమాటే. అందులో విజయ్ రెమ్యునరేషనే అత్యధికం అని తెలుస్తోంది. తెలుగులో దిల్ రాజు ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకు ఇవ్వనంత భారీ మొత్తం విజయ్ కి ఇస్తున్నారట. ఆ మొత్తం అటు ఇటుగా 100 కోట్లకు దగ్గరగా ఉంటుందని సమాచారం. విజయ్ ప్రతి సినిమాకు పారితోషకంతో పాటు లాభాల్లో వాటా కూడ తీసుకుంటారు. దిల్ రాజు సినిమాకి కూడ అంతేనట. అలా రెమ్యునరేషన్, లాభాల్లో వాటా కలిపితే 100 కోట్లకి పైనే పుచ్చుకుంటాడని అంచనా. దిల్ రాజు ఇప్పటికే అడ్వాన్స్ రూపంలో పెద్ద అమౌంట్ ముట్టజెప్పినట్టు టాక్. విజయ్ కు కేవలం తమిళంలోనే 150 కోట్ల వరకు మార్కెట్ ఉంది. ఆ లెక్కలన్నీ చూసుకునే దిల్ రాజు అంత పెద్ద మొత్తం ఆఫర్ చేసి ఉంటారు.