రాజకీయాల్లో ఎన్టీయార్‌కి కళ్యాణ్ రామ్ మద్దతిస్తాడా.?

Jr NTR

నందమూరి కుటుంబానికి సంబంధించి సినిమాలు, రాజకీయాలు వేర్వేరు కాదు. స్వర్గీయ నందమూరి తారకమారారావు స్థాపించిన టీడీపీ కోసం గతంలో యంగ్ టైగర్ ఎన్టీయార్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ పని చేశారు. అయితే, ఆ తర్వాత ఇద్దర్నీ టీడీపీ పక్కన పెట్టింది.

ప్రధానంగా యంగ్ టైగర్ ఎన్టీయార్, గతంలో టీడీపీ తరఫున ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పర్యటించారు.. ఈ క్రమంలోనే ఆయన రోడ్డు ప్రమాదానికి గురై, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు.

అంతలా టీడీపీ కోసం ఎన్టీయార్ కష్టపడ్డా, ఆయన్ని టీడీపీ దూరం పెట్టింది. లోకేష్‌ని ప్రమోట్ చేసే క్రమంలో ఎన్టీయార్‌ని డీ-గ్రేడ్ చేస్తూ వచ్చింది టీడీపీ. ఇప్పటికీ టీడీపీ నేతలు కొందరు, యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద విమర్శలు చేస్తూనే వుంటారు.

అయితే, తాతయ్య స్థాపించిన పార్టీ పట్ల ఎన్టీయార్, కళ్యాణ్‌రామ్‌లలో ఎప్పటికీ అభిమానం తగ్గదు. అయితే, ఈ మధ్య, ‘జై ఎన్టీయార్’ నినాదాలతో టీడీపీ జెండాలు.. అదీ యంగ్ టైగర్ బొమ్మతో కనిపిస్తున్నాయి. మరి, ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ఏమనుకుంటున్నాడు.?

ఒకవేళ టీడీపీ పగ్గాల్ని ఎన్టీయార్ చేపట్టాల్సి వస్తే, చంద్రబాబుని కాదని కళ్యాణ్ రామ్, తన సోదరుడు జూనియర్ ఎన్టీయార్‌కి మద్దతిస్తాడా.? ఇవ్వడా.? ఈ చర్చ రాజకీయ, సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.