Nara Lokesh: రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. విపక్షాల్లో వున్నప్పుడు రాజకీయ నాయకులకు గొంతు కాస్త ఎక్కవవుతుందంతే. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైఎస్సార్సీపీ కూడా అయినదానికీ, కానిదానికీ రచ్చ చేసిన సందర్భాలున్నాయ్. ప్రస్తుతం ఆ పని టీడీపీ చేస్తోంది. కానీ, ఇప్పుడిది పాండమిక్ సిట్యుయేషన్. కరోనా నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులున్నాయి.
ప్రతిపక్షం కావొచ్చు, ఇతర విపక్షాలు కావొచ్చు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం మామూలే. ఇలాంటి సమయాల్లోనే అధికార పార్టీ సంయమనం పాటించాలి. మరీ ముఖ్యంగా మంత్రులు, విపక్షాలు సంధించే ప్రశ్నలకు ఎదురుదాడి చేయడం మానేసి, సామాన్యులకు సేవలందించేందుకు ప్రయత్నించాలి. మరింతగా ప్రజల్ని ఆదుకోవడమెలాగో ఆలోచించాలి. కానీ, ఇక్కడ జరుగుతున్నది వేరు.
మరీ ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఏ విమర్శ చేసినా, దానికి కౌంటర్ ఇస్తూ పలువురు మంత్రులు మీడియా ముందుకొస్తున్నారు. లోకేష్ మీద విమర్శలు చేయడానికి ఉపయోగించే ఆ కాస్త సమయం కూడా ఎంతో ఎంతో విలువైనది.. ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుంది. లోకేష్ విమర్శలకు సమాధానమివ్వడానికి పార్టీ వేదికలపై చాలామంది వైసీపీ నేతలు ఖాళీగానే కనిపిస్తారు. కానీ, కొందరు మంత్రులెందుకో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, వాడకూడని పదజాలం వాడుతుంటుంటారు.
ఈ పరిస్థితుల్లో అది అవసరమా.? లోకేష్ మీద మంత్రులు చేసే ప్రతి విమర్శా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెడ్డపేరు తెస్తుంది. కరోనా బాధితుల్లో అసహనం, ఆందోళన, ఆవేదన పెరుగుతున్నమాట వాస్తవం. ఆక్సిజన్, మందుల కొరత వుంది. వైద్య చికిత్స పరంగానూ సమస్యలున్నాయి. వీటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి తప్ప, లోకేష్ మీద విమర్శలు చేయడం గురించి ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు.