‘కెజిఎఫ్’ సినిమాతో కన్నడ పరిశ్రమ ప్రతిష్ట పెరిగింది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అసలు కన్నడ ఇండస్ట్రీలో ఇంత పొటన్షియల్ ఉన్న డైరెక్టర్, హీరో ఉన్నారా అనేలా ఆశ్చర్యపోయారు ఇతర పరిశ్రమలవారు. ఆ సినిమా తర్వాత కన్నడలో వచ్చే ప్రతి పెద్ద సినిమా మీద జనాలు దృష్టి పెడుతున్నారు. ఏ సినిమా వస్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎలా ఉంది అనేది తెలుసుకుంటున్నారు. ప్రేక్షకుల్లో కలిగిన ఈ అటెంక్షన్ కన్నడ స్టార్ హీరోలకు ఇతర పరిశ్రమల మార్కెట్లోకి ఎంటర్ కావడానికి ఒక ఊతంలా కనబడింది.
ఇంకేముంది అక్కడ వచ్చే పెద్ద సినిమాలను తెలుగులో డబ్ చేసి వదిలే సంప్రదాయం మొదలైంది. అలా వచ్చిన సినిమానే ‘రాబర్ట్’. శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ నటించిన ఈ సినిమాను తెలుగులో అనువదించి పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. దర్శన్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేశారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్రకటనల కోసం భారీ ఎత్తున ఖర్చు చేశారు. దర్శన్ సైతం మాంచి యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, తనకు మార్కెట్ ఏర్పడుతుందని ఆశపడ్డారు.
అయితే ఆయన అంచనాలను తలకిందులు చేసేశారు తెలుగు ఆడియన్స్. సినిమా మనవాళ్లకు అంతగా ఎక్కలేదు. ఫలితం డిజాస్టర్. పోస్టర్లు, హోర్డింగులకు పెట్టిన ఖర్చులు కూడ వెనక్కి వచ్చేలా లేవు. రెండు రోజుల్లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వసూలు చేసిన షేర్ 15 లక్షల లోపే ఉంటుంది. ఆ విధంగా కన్నడ స్టార్ హీరోకి మన వాళ్ళు పీడ కల మిగిల్చారు.