మెగాస్టార్ కుటుంబం అందులేకపోయిన ఫలం ఏదైనా ఉంది అంటే అది రాజకీయమే అనాలి. సినీ రంగంలో శిఖరాగ్ర స్థాయిని చూసిన మెగాస్టార్ ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో పార్టీ పెట్టి మధ్యలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశారు. ముఖ్యమంత్రి అవదామనుకుని వచ్చిన ఆయన చివరకు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడ రాజకీయాల్లో నలుగుతున్నారు. అన్న సాధించలేకపోయిన దాన్ని తాను చేసి చూపిస్తాను అంటూ ఒంటరిగా రాజకీయాల్లోకి దూకారు.
వరుస ఓటములతో సతమవుతున్నారు. పెద్ద పార్టీల మధ్యన నెగ్గుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు. మొత్తంగా మెగా ఫ్యామిలీ పొలిటికల్ రికార్డ్ చూస్తే సీఎం పదవి వారికి కలగానే మిగిలుంది. అయితే ఇప్పుడు ఆ కలను చరణ్ నెరవేరుస్తాను అంటున్నాడు. నాన్న, చిన్నాన్న అందుకోలేకపోయిన సీఎం పదవిని తాను అందుకుంటాను అంటున్నారు. అయితే ఇది రియల్ లైఫ్లో కాదులెండి రీల్ లైఫ్లో. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నాడు. అందులో ఆయన సీఎం పదవిలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. పొలిటికల్ కథలను డీల్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. గతంలో ‘ఒకే ఒక్కడు’ లాంటి సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు రామ్ చరణ్ తో అలాంటి సినిమానే చేయాలనుకుంటున్నారట. మరి మెగా కుటుంబానికి అస్సలు కలిసిరాని సీఎం పదవిని చరణ్ ఆన్ స్క్రీన్ మీద ఎలా పోషిస్తారో చూడాలి.